వైసీపీ మంత్రి రాజ‌కీయ వైరాగ్యం.. రీజ‌న్ ఏంటి..?

-

సాధార‌ణంగా రాజ‌కీయ నాయ‌కుల‌కు.. జీవితంలో ఒక్క‌సారైనా ఎమ్మెల్యే, ఎంపీ కావాల‌ని కోరుకుంటారు. ఆ త‌ర్వాత మంత్రి అయితే.. ఇంకా బాగుండు.. అని అనుకుంటారు. అనుకున్న‌ట్టే రెండు మూడు సార్లు ఎమ్మెల్యే అయి, ఆ త‌ర్వాత మంత్రి అయితే.. ఇక ఆనందానికి అవ‌ధులు ఉంటాయా..? ఉండ‌నే ఉండ‌వు. కానీ.. ఆ ఏపీ మంత్రి నోటి నుంచి మాత్రం రాజ‌కీయ వైరాగ్యం ముచ్చ‌ట వ‌స్తోంది. దీనిపై ఇప్పుడు ఏపీ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. ఇంత‌కీ ఆ మంత్రి ఎవ‌రంటే.. ధ‌ర్మాన కృష్ణ‌దాస్‌.


జ‌గ‌న్ కేబినెట్‌లో మంత్రిగా కొన‌సాగుతున్న ఆయ‌న ఉన్న‌ట్టుండి ఒక్క‌సారిగా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఇక తాను రాజ‌కీయాల్లో కొన‌సాగ‌లేన‌ని, పార్టీ ప‌నులు అప్ప‌గిస్తే చేస్తాన‌ని, ఇవే త‌న‌కు చివ‌రి ఎన్నిక‌ల‌ని చెప్పుకొచ్చారు. మంత్రి వ్యాఖ్య‌ల‌పై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కార‌ణం ఏమై ఉంటుంద‌ని రాజ‌కీయ‌వ‌ర్గాలు తీవ్ర‌స్తాయిలో ఆలోచిస్తున్నాయి. కానీ.. కృష్ణ‌దాస్ వ్యాఖ్య‌ల్లోని ఆంత‌ర్యం ఎవ‌రికీ అంతుబ‌ట్ట‌డం లేదు. నిజానికి.. ధ‌ర్మాన కృష్ణ‌దాస్ పేరు శ్రీ‌కాకుళం జిల్లాలో త‌ప్ప ఇత‌ర ప్రాంతాల్లో తెలియ‌ద‌నే చెప్పొచ్చు.

ధ‌ర్మాన కృష్ణ‌దాస్‌, ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు ఇద్ద‌రూ అన్న‌ద‌మ్ములు. త‌మ్ముడు ప్ర‌సాద‌రావు.. ఉమ్మ‌డి రాష్ట్రంలో మంత్రిగా కూడా ప‌నిచేశారు. కాంగ్రెస్ పార్టీలో కీల‌కంగా ఉన్నారు. అయితే.. జ‌గ‌న్ కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత కృష్ణ‌దాస్ కూడా జ‌గ‌న్ కోసం బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఏకంగా త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి, ఉప ఎన్నిక‌ల్లో గెలిచారు. ఇలా మొద‌టి నుంచీ వైఎస్ కుటుంబానికి కృష్ణ‌దాస్ అండ‌గా ఉంటున్నారు. 2014 ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓడిపోయారు. అలాగే.. 2014 ఎన్నిక‌ల‌కు ముందే వైసీపీలో చేరిన ప్ర‌సాద‌రావు కూడా పోటీ చేసి ఓడిపోయారు.

అయినా.. ఎక్క‌డ కూడా నిరుత్సాహ‌నికి గురికాకుండా పార్టీ కోసం ప‌నిచేశారు. 2019 ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి, ఏకంగా జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో మంత్రి ప‌ద‌వికి ద‌క్కించుకున్నారు. అయితే.. ప్ర‌సాద‌రావు కూడా 2019 ఎన్నిక‌ల్లో పోటీ చేసి గెలిచారు. అయితే.. కృష్ణ‌దాస్‌కు మంత్రి ప‌ద‌వి వ‌చ్చిన త‌ర్వాత ప్ర‌సాద‌రావు కొంత అసంతృప్తితో ఉన్నార‌నే టాక్ వినిపిస్తోంది.

నిజానికి.. ఇద్ద‌రు సోద‌రులు ఎక్క‌డ కూడా పొర‌పొచ్చాలు లేకుండా రాజ‌కీయాల్లో కొన‌సాగుతున్నారు. మంత్రి హోదాలో కృష్ణ‌దాస్ హాయిగా రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టిస్తూ.. త‌న ప‌లుకుబ‌డిని మ‌రింత పెంచుకునే క్ర‌మంలో.. ఇలా అనూహ్యం ఇవే త‌న‌కు చివ‌రి ఎన్నిక‌లంటూ ప్ర‌క‌ట‌న చేయ‌డంలో ఆంత‌ర్యం ఏమిట‌న్న‌ది మాత్రం కాల‌మే చెబుతుంది మ‌రి. చూద్దాం.. ఏం జ‌రుగుతుందో..

Read more RELATED
Recommended to you

Latest news