రాజకీయాల్లో గెలుపోటములు సహజమే. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం నిజామాబాద్‌లో తన కుమార్తె కవిత ఓటమిని జీర్ణించుకోలేని స్థితిలో ఉన్నట్టే కనిపిస్తోంది. కేసీఆర్ ఎవరిని అయినా నమ్మితే ఎంతలా అందలం ఎక్కిస్తారో ? తేడా వస్తే అంతలా పక్కన పెట్టేస్తారు. నిజామాబాద్ ఎన్నికల్లో కవిత ఓటమితో కేసీఆర్ ఆ జిల్లాకు చెందిన చాలా మంది నేతలకు షాకులు ఇచ్చేందుకు రెడీగా ఉన్నారన్న ప్రచారం టీఆర్ఎస్ వర్గాల్లో కలకలం రేపుతోంది.
ఈ ఓటమి కన్నా తాను లైఫ్ ఇచ్చిన డీ.శ్రీనివాస్ అక్కడ పార్టీకి వెన్నుపోటు పొడిచి కవితను ఓడించడం కేసీఆర్‌కు ఏ మాత్రం మింగుడు పడడం లేదు. అక్కడ కవితపై గెలిచింది కూడా డీఎస్ తనయుడు అర్విందే. ఇక ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ పని పట్టేందుకు రెడీ అవుతున్నట్టే తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకు తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్‌లను ఓ ఆటాడుకున్న కేసీఆర్ బీజేపీ విషయంలో చాలా స్లోగానే ముందుకు వెళుతున్నారు.
ఇక ఎన్నికల్లో ఓటమి తర్వాత కవిత క్రియాశీలక రాజకీయాలకు దూరంగానే ఉంటూ వస్తున్నారు. త్వరలోనే కార్పొరేషన్, మునిసిపల్ ఎన్నికలు జరుగుతుండడంతో ఇప్పుడు కేడర్‌ను ఉత్సాహపరిచేందుకు ఆమె తిరిగి యాక్టివ్ కానున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు పార్టీ, ప్రభుత్వ పరంగా ఓ కీలక పదవి కట్టబెట్టేందుకు కేసీఆర్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.
లోక్‌సభ ఎన్నికల్లో కవితతో పాటే ఓటమి పాలైన టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వినోద్ కుమార్ కు సీఎం కేసీఆర్ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తారు. ఆయనకు కేబినెట్ హోదా ఉంటుంది. ఈ క్రమంలోనే కవితకు ప్రభుత్వానికి, పార్టీకి మధ్య సంధానకర్తగా కో ఆర్డినేట్ పదవి ఇవ్వాలన్న యోచనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది.
అలాగే ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన గుత్తా సుఖేందర్‌రెడ్డి రాష్ట్ర రైతు సమన్వయ సమితికి ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఇది కేబినెట్ హోదాతో ఉంటుంది. ఈ పదవికి కూడా కేసీఆర్ కవిత పేరును పరిశీలించినా ఆశ్చర్యపోనక్కర్లేదని తెలుస్తోంది. కవితకు ఏదైనా కీలక పదవి ఇస్తే అటు పార్టీలోనూ, ఇటు ప్రభుత్వంలోనూ తిరిగి దూసుకుపోవడానికి ఛాన్స్ ఉంటుంది. మరి కేసీఆర్ ఆమె విషయంలో ఎలాంటి ? నిర్ణయం తీసుకుంటారో ? చూడాలి.