పేదపిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ విద్యను పరిపూర్ణంగా అందించాలని.. ఆ భాష వస్తే ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నత అవకాశాలు పొందొంచ్చని.. ఎంతో విజన్ తో ఆలోచించి జగన్ నిర్ణయం తీసుకుని.. పేదవాడి కళ్లల్లో ఆనందాలు చూడాలని.. వారి బ్రతుకులు మార్చాలని భావించినప్పటినుంచి.. పెద్దపెద్ద మనుషులకందరికీ తెలుగు భాషపై ఎనలేని ప్రేమ వచ్చేస్తుంది!!
అవును… నేడు తెలుగు భాషపై తెగ కబుర్లు చెబుతున్న వారి పిల్లలు, వారి పిల్లలు ఎవరూ సరిగ్గా తెలుగులో మాట్లాడగలరో లేదో వారి విజ్ఞతకే వదిలేస్తే… పేదోడి పిల్లోడు మాత్రం తెలుగు భాషను కాపాడాలనే టార్గెట్ తో ప్రభుత్వ బడుల్లో తెలుగు భాషలో మాతమే చదవాలి… ఆర్థికంగా బలవంతులైనవారి పిల్లలు మాత్రం ఇంగ్లిష్ మీడియంలలో చదివి.. ప్రపంచంలో ఎక్కడైనా బ్రతకగలిగే స్థాయికి చేరాలి! ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఆలోచన కూడా ఇదే!!
అవును… తాజాగా ట్విట్టర్ లో తెలుగు భాషపై స్పందించారు పవన్ కల్యాణ్! ఆ విషయం ఎందుకుగుర్తొచ్చింది అన్నది ఇప్పుడు అప్రస్తుతం! “పిల్లలకు మనం ఆస్తిని, అస్థికలను మాత్రమే అప్పగించం.. మన భాషా సంపదని, సాంస్కృతిక వారసత్వాన్ని అందిస్తాం” అంటూ పవన్ కల్యాణ్ ఒక ట్వీటు ట్వీటారు! అంతవరకూ బాగానే ఉంది.. అందరూ తెలుగులోనే మాట్లాడాలి.. వీలైనంతవరకూ తెలుగుని మరిచిపోకూడదు అని కోరుకోవడం తప్పు లేదు కానీ… ఆ కోరికలు మన ఇంటినుంచి కూడా ఉండాలనేది మాత్రం జనం కచ్చితంగా కోరుకుంటున్నారన్న విషయం… జనసేన అధినేతకు కచ్చితంగా గుర్తుండాలి!
సరిగ్గా అడిగేవాడు లేకో ఏమో కానీ… గత కొన్ని రోజులుగా జగన్ ఇంగ్లిష్ మీడియం విద్యను ప్రవేశపెట్టినప్పటినుంచి.. తమ పిల్లలను కాన్వెంట్ బస్సు ఎక్కించిన అనంతరం మైకులముందుకు వచ్చేస్తున్న మేధావులు… తెలుగు భాష చాలా గొప్పది అని కబుర్లు చెప్పేస్తున్నారు! చెప్పేవాడికి వినేవాడెప్పుడూ లోకువే!! పేదోడిపిల్లలు ఎప్పటికీ తెలుగు భాషను మరిచిపోలేరు.. తెలుగులోనే మాట్లాడతారు.. మరి వారి ఇంగ్లిష్ ఎలా రావాలి? తెలుగు భాషపై ప్రేమ అంటే… తెలుగులో మాట్లాడమేనా లేక తెలుగులోనే విద్యాభోదన కూడా జరగడమా? అదే నిజమైతే… వీరి పిల్లలంతా ఎక్కడ చదువుతున్నారు? వారికి తెలుగు మాట్లాడటం అంతబాగా వచ్చా? మాతృభాషపై ప్రేమ ఉండాలి..దాన్ని సంరక్షించుకోవాలి.. కానీ అది పూర్తిగా పేదోడి భాధ్యతే అంటే ఎలా?
-CH Raja