అదేంటి? అలా అంటున్నారా? అంటే.. ఔను! ఇప్పటి వరకు వైసీపీ అధినేతగా ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన అనేక హామీలను నెర్చేప్రయత్నం చేస్తున్నారు. కొన్నింటిని నెరవేర్చారు. అమ్మ ఒడి, విద్యా దీవెన, రైతు భరోసా, డ్వాక్రా రుణ మాఫీ ఇలా అనేక విషయాల్లో ఆయన ఇచ్చిన హామీలు అన్నీ సంపూర్ణంగా పట్టాలెక్కి.. ప్రజలకు లబ్ధి చేకూరుతోంది. ఇక, కీలకమైన రెండు పథకాలు అమలైతే.. జగన్ పేదలకు ఇచ్చిన హామీల్లో దాదాపు అన్నీ నెరవేరినట్టేనని అంటున్నారు పరిశీలకులు.
వీటిలో పేదలకు ఇళ్లు, రెండు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం అమలు. పేదలకు ఇళ్లు పథకం.. ఇప్పటికి అనేక సార్లు వాయిదా పడింది. దాదాపు 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అనుకున్న ప్రభుత్వం అనేక వ్యయప్రయాసలకు ఓర్చి.. స్థలాలను రెడీ చేసుకున్నా.. కొందరు కోర్టులకు వెళ్లడంతో ఈ కార్యక్రమం వాయిదా పడుతూ వస్తోంది. దీంతో ఈ పథకం అమలవుతుందనే ఆశలు ఉన్నా.. ఖచ్చితంగా ఇప్పుడు.. అనే హామీ మాత్రం ఇవ్వలేక పోతున్నారు. ఇక, అదేసమయంలో కీలకమైన మరో పథకం.. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం.
నిజమే ప్రభుత్వ స్కూళ్లలో ఇప్పటి వరకు తెలుగు మీడియం వరకే పరిమితం కాగా.. త్వరలోనే ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టి.. పేదలకు ఆంగ్ల విద్యను చేరువ చేయాలనిజగన్ సర్కారు భావించింది. కానీ,ఇది ఓటు బ్యాంకుతో ముడిపడిన వ్యవహారం కావడంతో.. ప్రధాన విపక్షం టీడీపీ రాజకీయం చేసింది. దీంతో ఇది న్యాయ పోరాటానికి దారితీసింది. హైకోర్టు దీనిపై ఇచ్చిన జీవోను కొట్టేసింది. మాతృభాషలోనే విద్య సాగాలని తేల్చి చెప్పింది. దీంతో దీనిపై ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది. అయితే, అక్కడ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం కనిపించడం లేదు.
ఇంగ్లీష్ మీడియం అంశంలో ఏపీ ప్రభుత్వ పిటిషన్‌పై తాజాగా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పేద విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియంను తీసుకొచ్చిందని, 96 శాతం తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియం కోరుకుంటున్నారని ప్రభుత్వం కోర్టుకు విన్నవించింది. దీనిపై స్పందించిన న్యాయమూర్తి.. ఇతర దేశాల్లో ఆంగ్లంతోపాటు మాతృభాషలో బోధన కొనసాగుతుందన్నారు. గణాంకాల ఆధారంగా ఈ అంశంలో నిర్ణయం తీసుకోలేమని స్పష్టం చేశారు. అంటే.. తల్లిదండ్రుల అభిప్రాయం వినేది లేదని స్పష్టం చేశారు.
అంతేకాదు.. ప్రాథమిక విద్య మాతృభాషలో ఉండడం చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు. పునాది గట్టిగా ఉంటే ఏ భాషనైనా అలవోకగా నేర్చుకోవచ్చని వ్యాఖ్యానిస్తూ.. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేశారు. దీనిని బట్టి.. ఆంగ్ల మీడియాన్ని అనుమతించే అవకాశం సుప్రీంలోనూ లేదని స్పష్టమైంది. అంటే.. ఈ పథకం విషయంలో జగన్ హామీ అమలయ్యే సూచనలు కనిపించడం లేదు. సో.. కాబట్టి.. పేదలే ఈ విషయంలో జగన్‌ను అర్ధం చేసుకోవాలని అంటున్నారు పరిశీలకులు.
-vuyyuru subhash