ఏపీలో టీడీపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా చంద్రబాబు ముందుకెళుతున్నారు. 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి పాలై ఏడాది దాటాక పార్టీని ప్రక్షాళన చేసే దిశగా నడుస్తున్నారు. అందులో భాగంగానే పార్టీలో కీలక మార్పులు చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే ఏపీ అధ్యక్షుడుగా అచ్చెన్నాయుడుని పెట్టడానికి సిద్ధమయ్యారని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం అధ్యక్షుడుగా ఉన్న కళా వెంకట్రావు స్థానంలో, అచ్చెన్నని నియమించాలని చూస్తున్నారని తెలిసింది.
ఇదే సమయంలో బాబు వ్యూహాలు ఎప్పటికప్పుడు మారుతున్నాయని తెలుస్తోంది. అచ్చెన్నతో పాటు అధ్యక్ష రేసులోకి బీదా రవిచంద్రా యాదవ్ పేరు కూడా వచ్చింది. ప్రస్తుతం నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడుగా ఉన్నా బీదా పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అలాగే దేవినేని అవినాష్ వైసీపీలోకి వెళ్లిపోయాక రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుని పదవి ఖాళీగా ఉంటుంది.
ఈ పదవిని మాజీ టిఎన్‌ఎస్‌ఎఫ్ అధ్యక్షుడు నాదెండ్ల బ్రహ్మం చౌదరీకి ఇస్తారని ఇటీవల ప్రచారం జరిగింది. కానీ బాబు వ్యూహాత్మకంగా శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుకు తెలుగు యువత బాధ్యతలు అప్పగించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే రామ్మోహన్ ఎంపీగా ఉన్నారు కాబట్టి ఆయన ఆసక్తి చూపకపోవడంతో తెలుగు యువత బాధ్యతలు పరిటాల శ్రీరామ్‌కు అప్పగించాలని పార్టీ కేడర్ నుంచి డిమాండ్ వస్తుంది.
రామ్మోహన్‌కు ఇస్తే మంచిదని, ఆయన కాని పక్షంలో టీడీపీలో మంచి క్రేజ్ ఉన్న శ్రీరామ్‌కు అప్పగిస్తే, పార్టీకి మరింత యూత్ ఫాలోయింగ్ పెరుగుతుందని అంటున్నారు. రామ్మోహన్ కంటే శ్రీరామ్ దూకుడుగా ఉంటారని, అధికార వైసీపీకి చెక్ పెట్టాలంటే ఇలా దూకుడుగా ఉండే శ్రీరామ్ అయితే బెటర్ అని అంటున్నారు.
పైగా తనకు శ్రీకాకుళం లోక్‌సభ ఎంపీ బాధ్యతలు ఉన్నందువల్ల ఈ పదవికి న్యాయం చేయలేనని రామ్మోహన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాబట్టి శ్రీరామ్ అయితే పార్టీకి బాగా బెన్‌ఫిట్ అవుతుందని అంటున్నారు. రాష్ట్ర అధ్యక్ష, తెలుగు యువత అధ్యక్ష పదవులు ఎవరికి దక్కుతాయో అన్నది కాస్త సస్పెన్స్‌గానే ఉంది.
-Vuyyuru Subhash