అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. కాసేపటి క్రితమే.. ఆంధ్ర ప్రదేశ్ పదో తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేశారు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. ఈ సందర్భంగా ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. 2020 లో మొత్తం 6, 37, 354, మంది పదవ తరగతిలో ఉత్తీర్ణులైయ్యారని.. అలాగే 2021 లో 6,26, 981 మంది పదవ తరగతిలో ఉత్తీర్ణులైయ్యారని స్పష్టం చేశారు. ఇక 2021 లో 3,21,555 మంది బాలురు ఉత్తీర్ణులైయ్యారని.. అలాగే బాలికలు 3,02,812 మంది ఉత్తీర్ణులైయ్యారని వెల్లడించారు.
ఛాయా రతన్ నేతృత్వంలోని హైపవర్ కమిటీ సూచనల మేరకు గ్రేడ్లు కేటాయించామని.. కోవిడ్ వల్ల పరీక్షలు నిర్వహించలేక పోయామన్నారు. అయినా ఏ ఒక్క విద్యార్థి కూడా నష్టపోకూడదనే గ్రేడింగ్ ఇస్తూ ఫలితాలు వెల్లడిస్తున్నామని చెప్పారు. 2019-20 పదవ తరగతి విద్యార్ధులకు సమ్మటివ్ అసెస్ మెంట్ -1 కి 50 శాతం వెయిటేజ్, మూడు ఫార్మాటివ్ అసెస్ మెంట్ లకు కలిపి 50 శాతం వెయిటేజ్ ఇచ్చామన్నారు. 2020-21 పదవ తరగతి విద్యార్ధులకు 70%, 30 % వెయిటేజ్ కేటాయించామని.. స్లిప్ టెస్టులకు 70 శాతం వెయిటేజ్, ఫార్మాటివ్ అసెస్ మెంట్ కు 30 శాతం వెయిటేజ్ ఇచ్చామని స్పష్టం చేశారు.