గత వారం రోజులుగా ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు ప్రైవేట్ బస్సులు తిరుగుతున్నాయి. ప్రతి రోజు 150 బస్సులు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలకు వెళుతున్నాయి. సంక్రాంతి పండుగ రద్దీ వేళ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల దోపీడీపై అధికారులు దృష్టి పెట్టారు. జిల్లాల డీటీసీలతో రవాణా శాఖ కమిషనర్ ఆంజనేయులు సోమవారం సమావేశమయ్యారు. సంక్రాంతి నేపథ్యంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రైవేటు బస్సుల్లో 10 రోజుల పాటు తనిఖీలు నిర్వహించనున్నట్లు రవాణాశాఖ సంయుక్త కమిషనర్ వెంకటేశ్వరరావు తెలిపారు.
అలాగే, రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేస్తామని వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఫిట్‌నెట్, ఇతర ధ్రువపత్రాలు లేని బస్సులు సీజ్ చేస్తామని తెలిపారు. గమ్యస్థానం చేరాకే బస్సులను సీజ్ చేయాలని నిర్ణయించారు. అలాగే, ఎవరైనా ఆన్‌లైన్ బుకింగ్‌లో వసూలు చేసే ఛార్జీలు చూసి కేసులు నమోదు చేస్తామన్నారు. ఛార్జీల విషయంలో ప్రయాణికులు కూడా రవాణా శాఖ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని ఆయన తెలిపారు.