చాలా మంది శీతాకాలంలో అరకు వెళ్లాలని అనుకుంటూ వుంటారు. నిజానికి ఈ సీజన్ లో అరకు చాలా బాగుంటుంది. అందుకే ఆంధ్రా ఊటీ అంటారు. హైదరాబాద్ నుండి కూడా ఎవరైనా అరకు వెళ్లాలని అనుకుంటే ఈ ప్యాకేజీ ని చూడండి. హైదరాబాద్ నుంచి అరకు టూర్ ప్యాకేజీ వివరాలను మనం ఇప్పుడు చూసేద్దాం. తెలంగాణ టూరిజం అధికారిక వెబ్‌సైట్‌లో ఈ టూర్ ప్యాకేజీ వివరాలున్నాయి.
రూ.7,000 లోపే ఐదు రోజులు మీరు ఈ టూర్ వేసేయచ్చు. హైదరాబాద్‌లో మొదటి రోజు ఈ టూర్ మొదలవుతుంది. సాయంత్రం 6 గంటలకు పర్యాటక భవన్ వద్ద బస్సు ఎక్కచ్చు. 6.30 గంటలకు సీఆర్‌ఓ బషీర్‌బాగ్‌లో అయినా బస్సు ఎక్కచ్చు. రెండో రోజు ఉదయం 6 గంటలకు వైజాగ్ రీచ్ అవుతారు. హోటల్‌లో ఫ్రెష్ అయ్యాక విశాఖపట్నం లోకల్ సైట్ సీయింగ్ కి వెళ్ళచ్చు.
సింహాచలం, రుషికొండ బీచ్, సబ్‌మెరైన్ మ్యూజియం, కైలాసగిరి ఇవన్నీ చూసేయచ్చు. రాత్రికి వైజాగ్‌లో స్టే చేయాలి. తరవాత మూడో రోజు ఉదయం 6 గంటలకు అరకు స్టార్ట్ కావాలి. అక్కడ మీరు ట్రైబల్ మ్యూజియం, అనంతగిరి కాఫీ తోటలు చూడచ్చు. అలానే బొర్రా గుహలు, ధింసా డ్యాన్స్ చూడొచ్చు. నైట్ అరకులో బస చేయాలి. నాల్గవ రోజు అన్నవరం వెళ్ళాలి. దర్శనం అయ్యాక మళ్ళీ హైదరాబాద్ కి ప్రయాణమవ్వాలి. ఐదో రోజు ఉదయం 7 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. ధర విషయానికి వస్తే.. పెద్దలకు ఒకరికి రూ.6,999, పిల్లలకు రూ.5,599 చెల్లించాలి. పూర్తి వివరాలను https://tourism.telangana.gov.in/ వెబ్‌సైట్‌లో చూడచ్చు.