మీరు UPI పేమెంట్స్ చేస్తున్నారా.. అయితే ఈ టైప్ మోసాలతో జాగ్రత్త

-

ఈ రోజుల్లో యూపీఐ పేమెంట్స్ చేయని వాళ్లు చాలా అరుదుగా ఉంటారు. క్షణాల్లో మనీ ఎక్కడ నుంచి ఎక్కడికైనా పంపేయొచ్చు. ప్రాసెస్ ఈజీ అయింది.. మనకే కాదు.. సైబర్ నేరగాళ్లకు కూడా ఈ టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుంది. చదువుకున్న వాళ్లే వీరి ఉచ్చులో పడుతున్నారు. ఈరోజు మనం ఆన్ లైన్ మోసాలు ఎలా జరుగుతాయి, ఏ విధంగా జాగ్రత్త పడాలో చూద్దాం.

చాలామంది.. ఆన్ లైన్ లో ఏదైనా అమ్మాలంటే.. వెబ్ సైట్ లో ప్రకటన ఇస్తుంటారు. అది చూసి చాలా మంది ఫోన్ చేస్తారు. అలాగే సాయి కూడా తన వాషింగ్ మెషిన్ అమ్మడానికి యాడ్ ఇచ్చాడు. పెట్టిన పదినిమిషాలకే చాల కాల్స్ వచ్చేశాయి. కొంటాం అన్నారు. డబ్బుులు కూడా మాట్లాడుకున్నారు.

కన్ఫర్మేషన్ కోసం ముందుగా సాయి బ్యాంక్ అకౌంట్‌కు రెండు రూపాయలు పంపాడు. సాయి వచ్చాయని చెప్పడంతో.. ఆ అజ్ఞాత వ్యక్తి సాయికి క్యూఆర్ కోడ్ పంపాడు. మిగిలిన డబ్బును పంపడానికి క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయమని సాయిని అడిగాడు. మనోడు స్కాన్ చేశాడు. అంతే మూడు విడతలుగా మొత్తం రూ.30 వేలు డ్రా అయ్యాయి. ఇలా మోసపోయిన వారు చాలా మందే ఉంటారు. ఇలాంటి మోసాలలో చిక్కుకోకుండా ఉండాలంటే.. మీరు అప్రమత్తంగా ఉండాలి.

క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ మోసాలతో జాగ్రత్త..

సైబర్ మోసగాళ్లు ముందుగా పేమెంట్ రిక్వెస్ట్ అంగీకరించమని అడుగుతారు. లేకపోతే లావాదేవీ విఫలమవుతుందని చెబుతూ వారిని బట్టులో పడేస్తారు. మీరు QR కోడ్‌ని స్కాన్ చేసినప్పుడు, రెండు కారకాల ఫ్యాక్టర్స్ (2 FA) లేదా UPI పిన్‌ను అడుగుతారు. మరోవైపు, మీరు పేమెంట్ రిక్వెస్ట్ ను అంగీకరించినప్పుడు, UPI యాప్ మిమ్మల్ని లావాదేవీకి చివరి దశ అయిన పిన్‌ని అడుగుతుంది. అంటే మీరు UPI PINని నమోదు చేసిన వెంటనే, మీ డబ్బు తీసుకుంటారు.

మనకు ఎవరైనా డబ్బులు ఇవ్వాలంటే.. అసలు మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి QR కోడ్‌ని స్కాన్ చేయాల్సిన పనిలేదు, పిన్ కూడా ఎంటర్ చేయాల్సిన పనిలేదు.. ఈ విషయాన్ని అందరూ బలంగా గుర్తుంచుకోవాలి. కానీ వాళ్లు మనల్నీ ఇదే పాయింట్ లో కన్ఫ్యూస్ చేస్తారు. మీరు కన్ఫామ్ చేయండి… స్కాన్ చేయండి అంటూ.. OTP, పాస్‌వర్డ్, MPIN, UPI పిన్ వంటి అంశాలు మీరు డెబిట్ చేయాలనుకున్నప్పుడు మాత్రమే అవసరం. మీ ఖాతాలో డబ్బును క్రెడిట్ చేయడానికి కాదని గుర్తుంచుకోండి.

సైబర్ మోసగాళ్లు మీకు నకిలీ బ్యాంక్ URLలు లేదా చెల్లింపు లింక్‌లను SMS ద్వారా పంపుతారు. దాన్ని క్లిక్ చేయడం ద్వారా, వారు మీ ఫోన్ UPI యాప్‌ని చూడగలుగుతారు. ఈలోగా, మీ ఫోన్ నుంచి ఆటో-డెబిట్‌ని ఎనేబుల్ చేయడానికి UPI యాప్‌లలో ఒకదాన్ని ఎంచుకోమని మిమ్మల్ని అడుగుతారు. మీరు దీన్ని ఆమోదించిన వెంటనే, మీ UPI యాప్ ద్వారా డబ్బు తక్షణమే తీసుకుంటారు. ఇది కాకుండా, నకిలీ URLపై క్లిక్ చేయడం ద్వారా, మీ ఫోన్ వైరస్ లేదా మాల్వేర్ బారిన పడవచ్చు. మీ పరికరంలో నిల్వ చేసిన మొత్తం ఆర్థిక సమాచారాన్ని దొంగిలించడానికి ఈ రకమైన మాల్వేర్ ను ఉపయోగిస్తారు. అసలు తెలియని ఎలాంటి లింక్స్ పైన క్లిక్ చేయొద్దని బలంగా గుర్తుంచుకోండి.

పాటించవలసిన జాగ్రత్తలు..

OTP, UPI PINని షేర్ చేయకపోవడమే కాకుండా, మీరు కొన్ని ఇతర విషయాలపై కూడా శ్రద్ధ వహించాలి. స్పామ్ సందేశాలపై క్లిక్ చేయ్యొద్దు. వాటి వల్ల మీ డేటా లీక్ కావొచ్చు. సైబర్ మోసగాళ్లు మిమ్మల్ని సంప్రదించడానికి వాటిని ఉపయోగిస్తారు. చాలాసార్లు క్రెడిట్ కార్డు ఇస్తామని, ఉన్న కార్డు లిమిట్ పెంచుతామని కూడా ఫేక్ కాల్స్ వస్తుంటాయి. మీరు క్రెడిట్ కార్డు వాడే విషయంలో కూడా చాలా జాగ్రత్త అవసరం. లిమిట్ పెంచుకోవాలని అనుకుంటే.. బ్యాంక్ ద్వారానే చేసుకోవాలి.

వాళ్లంతట వాళ్లు కాలు చేసేవి నమ్మకపోవడమే మంచిది. ఎవరికీ కూడా ఎట్టిపరిస్థితుల్లో.. ఓటీపీ, కోడ్ లాంటివి ఏది చెప్పొద్దు. ఈమధ్య చాలామంది ఓటీపీ పంపించి.. ఇది ఓటీపీ కాదు.. జస్ట్ కోడ్ మాత్రమే.. ఎంటర్ చేయండి అంటున్నారు. కాబట్టి తెలియని వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు చేసేప్పుడు ఈ విషయాల్లో జాగ్రత్త అవసరం. మరీ ముఖ్యంగా.. మనకు డబ్బులు ఇవ్వాల్సినప్పుడు మనం ఎలాంటి కోడ్ స్కాన్ చేయాల్సిన అవసరం లేదు, పిన్ నెంబర్ ఎంటర్ చేయాల్సిన పని లేదు. వాళ్లు ఎన్ని చెప్పినా.. డబ్బులు తీసుకునే విషయంలో ఈ పనులు అసలు చేయద్దు.

Read more RELATED
Recommended to you

Latest news