ఎల్ఈడీ బల్బుల నుంచి వెలువడే కాంతి (బ్లూలైట్) తీవ్రత ఎక్కువగా ఉంటుందట. దీంతో అది మన కంటి చూపును దెబ్బ తీస్తుందట.
ప్రస్తుతం చాలా మంది ఇండ్లు, కార్యాలయాల్లో ఎల్ఈడీ బల్బులను వాడుతున్న విషయం విదితమే. విద్యుత్‌తోపాటు డబ్బు ఆదా చేయవచ్చని చాలా మంది ఈ బల్బులను ఉపయోగిస్తున్నారు. అయితే ఈ బల్బుల వల్ల మన కంటిలో ఉండే రెటీనా శాశ్వతంగా దెబ్బ తినే అవకాశం ఉంటుందట. పలువురు సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో ఈ విషయం తేలింది.
ఫ్రాన్స్‌లోని ఫ్రెంచ్ ఏజెన్సీ ఫర్ ఫుడ్, ఎన్విరాన్‌మెంట్ అండ్ ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ (ఏఎన్ఎస్ఈఎస్) సంస్థకు చెందిన పరిశోధకులు చేసిన ప్రయోగాల్లో ఎల్ఈడీ బల్బులు కంటి చూపును దెబ్బతీస్తాయని తేలింది. సంప్రదాయ సోడియం బల్బుల కన్నా ఈ ఎల్ఈడీ బల్బులే మన ఆరోగ్యానికి ఎక్కువగా హాని చేస్తున్నాయని తేలింది. ఎల్ఈడీ బల్బులు ఫోటో టాక్సిక్ వస్తువులని సైంటిస్టులు చెబుతున్నారు. మన కంటిలోని రెటీనా లోపల ఉండే కణాలు ఎల్ఈడీ బల్బుల వల్ల నాశనమై పోతాయని, దాంతో మనం కంటి చూపును కోల్పోతామని సైంటిస్టులు చెబుతున్నారు.
ఎల్ఈడీ బల్బుల నుంచి వెలువడే కాంతి (బ్లూలైట్) తీవ్రత ఎక్కువగా ఉంటుందట. దీంతో అది మన కంటి చూపును దెబ్బ తీస్తుందట. అందుకని వీలైనంత వరకు ఎల్ఈడీ బల్బుల వాడకాన్ని తగ్గించాలని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే ఎల్ఈడీ బల్బులను నేరుగా చూడకపోతే చాలని, దాంతో కొంత వరకు కంటి చూపు సమస్య రాకుండా చూసుకోవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. ఇక రాత్రి పూట నిద్రపోయేటప్పుడు ఎల్ఈడీ బల్బులను కచ్చితంగా ఆఫ్ చేయాలని కూడా వారు సూచిస్తున్నారు. కనుక.. మీరు కూడా మీ ఇండ్లలో ఎల్ఈడీ బల్బులను వాడుతున్నట్లయితే జాగ్రత్తగా ఉండండి. లేదంటే కంటి చూపు పోయేందుకు అవకాశం ఉంటుంది..!