ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రతీ ప్రభుత్వ కార్యాయలంలో బీఆర్ అంబేద్కర్, భగత్ సింగ్ ఫోటోలు ఉంటాయని ప్రకటించారు. రాజకీయ నేతలు, సీఎంల ఫోటోలు పట్టబోం అంటూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రతి పిల్లవాడికి నాణ్యమైన విద్య అందించాలనే బిఆర్ అంబేద్కర్ కలలను నెరవేరుస్తామని ఈ రోజు మనం ప్రతిజ్ఞ చేస్తున్నామని కేజ్రీవాల్ అన్నారు. గత ఏడేళ్లలో విద్యారంగంలో విప్లవాన్ని తీసుకొచ్చామని… అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్ కూడా మా ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారని గుర్తు చేశారు.
ఢిల్లీలో త్వరలోనే ఆంక్షలు ఎత్తివేసే దిశగా ప్రయత్నిస్తున్నామని.. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఢిల్లీలో కోవిడ్ తీవ్రత తగ్గిందని ఆయన అన్నారు. జనవరి 15 నాటికి పాజిటివిటీ రేటు 30 శాతంగా ఉంటే ప్రస్తుతం 20 శాతానికి తగ్గిందని ఆయన వెల్లడించారు. సమర్థవంతంగా టీకాను అమలు చేయడం ద్వారానే కరోనాను అరికట్టగలుగుతున్నామని ఆయన అన్నారు.