గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. ప్రచార గడువు సమీపిస్తున్నందున ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఎలాగైనా ఈసారి గుజరాత్‌లో పాగా వేయాలని తీవ్రంగా శ్రమిస్తోంది ఆమ్ఆద్మీ పార్టీ. ఇప్పటికే ఆ పార్టీ కన్వీనర్, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చాలాసార్లు రాష్ట్రంలో పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
బీజేపీ పాలనలో మోర్బీ వంతెన వంటి విషాద ఘటన మరోసారి ఎప్పుడైనా ఎవరికైనా ఎదురుకావచ్చని కేజ్రీవాల్ అన్నారు. ఆ ఘటనలో ఓ ప్రైవేటు సంస్థ యజమానులపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కేసులు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. రాజ్‌కోట్‌లో జరిగిన రోడ్‌షోలో పాల్గొని ప్రసంగించిన ఆయన.. రాష్ట్రాన్ని పాలించేందుకు తమ పార్టీకి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించారు.
గత 27ఏళ్లుగా రాష్ట్రాన్ని పాలించేందుకు బీజేపీకి రాష్ట్ర ప్రజలు అవకాశం ఇచ్చారన్న కేజ్రీవాల్.. ఈ ఐదేళ్లు ఆమ్‌ఆద్మీకి ఇచ్చి చూడండని అభ్యర్థించారు. దేశ రాజధాని దిల్లీతోపాటు పంజాబ్ రాష్ట్రాల్లో తాము చేపట్టిన పనుల ఆధారంగానే గుజరాత్ పౌరులకు హామీలు ఇస్తున్నామని చెప్పారు. వచ్చే మార్చి నుంచి కరెంటు బిల్లులు చెల్లించాల్సిన అవసరం ఉండదన్న ఆయన.. దిల్లీ, పంజాబ్‌లలో ఉచిత కరెంటును అమలు చేస్తున్నామని చెప్పారు.