ఇటీవల ఐక్యరాజ్యసమితి చైనా జనాభాను భారత్ వచ్చే ఏడాదిలో అధిగమించబోతోందంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. గత ఐదు దశాబ్దాలుగా జనాభా నియంత్రణ కార్యక్రమాలు మన దేశంలో పెద్ద ఎత్తున జరుగుతున్నాయని… అయితే ఈ కార్యక్రమంలో అందరి భాగస్వామ్యం సమానంగా ఉండాలని చెప్పారు. ఒక సామాజికవర్గం జనాభా నియంత్రణను సరిగ్గా పాటించడం లేదన్న సీఎం యోగి.. ఇదే జనాభా అసమతుల్యతకు దారి తీస్తోందన్నారు. భారత మూలవాసుల్లో చైతన్యాన్ని కల్పించి, జనాభాను నియంత్రిస్తామని సీఎం యోగి తెలిపారు. ఈ క్రమంలో, యోగి వ్యాఖ్యలకు ఎంఐఎం అధినేత ఒవైసీ కౌంటర్ ఇచ్చారు. మన దేశంలో జనాభా నియంత్రణ సాధనాలను ఎక్కువగా వాడుతున్నది ముస్లింలేనని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.
ముస్లింలు భారతదేశ మూలవాసులు కాదా? అని ప్రశ్నించారు అసదుద్దీన్ ఓవైసీ. ఈ విషయం గురించి మనం వాస్తవాలను, నిజాలను చూసినట్టయితే… మన దేశ అసలైన మూలవాసులు గిరిజనులు, ద్రవిడ జాతి పౌరులు మాత్రమేనని సంచలన వ్యాఖ్యలు చేశారు అసదుద్దీన్ ఓవైసీ. యూపీ విషయానికి వస్తే 2026-30 నాటికి ఎలాంటి చట్టం లేకుండానే… మనం లక్ష్యంగా పెట్టుకున్న జననాల రేటును సాధించవచ్చని అన్నారు అసదుద్దీన్ ఓవైసీ. మన దేశంలో 2016లో జననాల రేటు 2.6 శాతంగా ఉంటే… ఇప్పుడు అది 2.3 శాతానికి తగ్గిందని అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు. ప్రపంచంలో అన్ని దేశాల కంటే మన దేశంలోనే జననాల రేటు తక్కువగా ఉందన్నారు అసదుద్దీన్ ఓవైసీ.