విశాఖ: ఆలయ దర్శనానికి వెళ్లిన తనకు కరోనా పేరు చెప్పి తలపాగా చుట్టలేదని సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ఆదేశాల మేరకు చూడటం లేదని అధికారులు చెప్పడంతో వెల్లంపల్లిపై మండిపడ్డారు. ఆలయ అనువంశిక ధర్మకర్తలకు ఈ పద్ధతులు పాటించాల్సిన అవసరం ఉందన్నారు. పూర్వికులు ఇచ్చిన ధర్మాని అందించాల్సిన బాధ్యత తమ మీద ఉందని చెప్పారు. మతాన్ని ఆరాధించాలి, ఎదుటి వారి మతాన్ని గౌరవించాలి, ఇప్పుడది లోపించినట్లు కనిపిస్తుందని అశోక్ గజపతి రాజు తెలిపారు.
‘‘దేవాలయాల దగ్గర నుంచి ప్రభుత్వం డబ్బులు తీసుకుంటుంది. ఎందుకు తీసుకుంటుంది. వాటి సంరక్షణ కోసమే కదా?. రామతీర్థం దేవాలయంలోకి అనువంశిక ధర్మకర్తను పంపించలేదు గానీ, జైలు నుంచి బయటికి వచ్చి బెయిలపై ఉన్న దొంగను పంపించారు. విగ్రహాల తయారీకి లక్ష రూపాయలు ఇస్తే వద్దన్నారు. ఆలయ అనువంశిక ధర్మకర్తలతో ఆడుకోవడం సరికాదు. హిందువులు భిక్షగాళ్ళు కాదు. వారు గౌరవంగా బ్రతికేవాళ్ళు. వారిని భిక్షగాళ్లుగా చెయ్యాలని ప్రయత్నం జరుగుతోంది. అప్పన్న ప్రసాదాలు ధరలు కూడా పెంచేశారని విన్నా. వ్యాపార దృక్పధంతో ఆలోచించకూడదన్నది నా అభిప్రాయం. రాష్ట్ర ప్రభుత్వం ఇలా చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది. అందరికి ఆ భూములే కావాలి. దేవాలయాల నుంచి వచ్చే 17 శాతం నిధులు మంత్రిగారివికాదు..ముఖ్యమంత్రి గారి పాకెట్ మనీ కాదు.. భక్తుల సొమ్ము. ఇదేమైన చిల్లర కొట్టు అనుకుంటున్నారా. భక్తుల సొమ్మును పథకాలు ఇవ్వడానికి వాడుతున్నారు. విజయనగరం పైడితల్లి అమ్మవారిని దర్శించుకొని ఈ ప్రభుత్వానికి మంచి జ్ఞానం ప్రసాదించమని కోరుకున్నా. దేవాదాయశాఖ మంత్రి నోటి నుంచి మంచి మాటలు రావాలి కానీ..వారి నోటి నుంచి బూతులు వస్తున్నాయి.’’అని అశోక్ గజపతిరాజు అన్నారు.