టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ఏపీలో సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే.. స్కిల్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు ప్రస్తుతం రిమాండ్‌లో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. అయితే.. ఇవాళ రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబును ములాఖత్‌లో భాగంగా నారా భువనేశ్వరి, బ్రాహ్మణి, అచ్చెన్నాయుడు కలిశారు. ములాఖత్ అనంతరం అచ్చెన్న మీడియాతో మాట్లాడుతూ… అరెస్టుకు భయపడే నారా లోకేశ్ ఢిల్లీలో ఉంటున్నారన్న మంత్రి రోజా, ఇతర వైసీపీ నేతల వ్యాఖ్యలపై అచ్చెన్నాయుడు స్పందించారు. అరెస్టుకు భయపడి లోకేశ్ ఢిల్లీలో ఉన్నారన్న వైసీపీ నేతల వ్యాఖ్యలను ఖండించారు. తాము తప్పులు చేయమని, ఎవరికీ భయపడేది లేదన్నారు. అవివేకులు మాత్రమే అలా మాట్లాడుతారన్నారు అచ్చెన్నాయుడు. తండ్రికి ఇలా జరిగితే (చంద్రబాబు జైల్లో ఉండటాన్ని ఉద్ధేశించి) ఆయన ఢిల్లీలో తనవంతుగా ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
న్యాయ నిపుణులతో మాట్లాడుతున్నారని, ఢిల్లీకి వెళ్లి వాస్తవాలు చెప్పారని, దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు ఏపీలో
జరుగుతున్న అంశాలను వివరిస్తున్నారని అచ్చెన్నాయుడు చెప్పారు. త్వరలో యువగళం పాదయాత్ర ప్రారంభమవుతుందన్నారు. అనుమతులు తీసుకున్నాక పాదయాత్రను ప్రారంభిస్తామన్నారు. చంద్రబాబును రెండురోజుల పాటు విచారించిన సీఐడీ అధికారులు 33 ప్రశ్నలు వేసి, కనీసం ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారని అచ్చెన్నాయుడు అన్నారు. చంద్రబాబుపై ఆధారాలు లేకుండా కేసు నమోదు చేశారన్నారు. పనికిమాలిన, సంబంధం లేని ప్రశ్నలు వేశారని, రెండురోజుల పాటు ఆయనను ఇబ్బంది పెట్టారన్నారు.