శ్రీలంక అధ్యక్ష భవనంలో 100కిపైగా కళాఖండాలు మాయం

-

శ్రీలంక అధ్యక్ష భవనంతోపాటు ప్రధానమంత్రి వ్యక్తిగత నివాసం నుంచి వెయ్యికిపైగా విలువైన కళాఖండాలు మాయమయ్యాయి. ఈనెల 23న స్థానిక పోలీసులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఇందులో అత్యంత పురాతన, అరుదైన వస్తువులు ఉన్నట్లు తెలిపారు.

ఆర్థిక సంక్షోభం నిర్వహణలో వైఫల్యాన్ని నిరసిస్తూ.. జులై 9న లక్షల సంఖ్యలో నిరసనకారులు మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సతోపాటు మాజీ ప్రధాని రణిల్ విక్రమసింఘేనివాసాల్లోకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రధాని నివాసానికి నిప్పు పెట్టారు. అనంతరం అక్కడే కొన్ని రోజులు తిష్ఠ వేశారు. వాటిని పిక్నిక్‌ స్పాట్‌లుగా మార్చేశారు.

ఈ క్రమంలోనే అధ్యక్ష భవనంతోపాటు ప్రధాని నివాసం నుంచి అరుదైన కళాఖండాలతోసహా వెయ్యికిపైగా విలువైన వస్తువులు మాయమయ్యాయని పోలీసు వర్గాలను ఉటంకిస్తూ ఓ వార్తాసంస్థ పేర్కొంది. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి దర్యాప్తునకు ప్రత్యేక బృందాలనూ ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. అధ్యక్ష భవనంలోని పురాతన వస్తువులు, కళాఖండాల గురించి శ్రీలంక పురావస్తుశాఖ వద్ద రికార్డులు లేకపోవడం.. అధికారులకు సమస్యగా మారినట్లు తెలిపింది. వెయ్యికిపైగా వస్తువులు పోయినట్లు పోలీసులు అంచనా వేసినా.. ఈ సంఖ్యపై ఒక స్పష్టతకు రావడం కష్టమేనని పురావస్తుశాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి చెప్పారు.

ఇదిలా ఉండగా.. నిరసనకారులు శాంతియుతంగా తమ ప్రదర్శనలను చేపట్టే హక్కును గౌరవిస్తానని, అయితే అధ్యక్ష భవనం, ప్రధాని నివాసం మాదిరి మరో ప్రభుత్వ భవనాన్ని ఆక్రమించడాన్ని తాను అనుమతించబోనని కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే తాజాగా స్పష్టం చేశారు. గత కొన్ని రజులుగా పార్లమెంట్ భవనం ఎదుట నిరసన తెలుపుతున్న ఆందోళనకారులను ఖాళీ చేయించారు.

Read more RELATED
Recommended to you

Latest news