కుప్పం టీడీపీ నేతల ఇళ్లపై దాడి.. వైసీపీ నేతలపై ఫైర్ అయిన చంద్రబాబు!

చిత్తూరు జిల్లా కుప్పం టీడీపీ నేత రవి, గంగమ్మ గుడి మాజీ చైర్మన్ ఆర్ఆర్.రవి ఇళ్లపై సోమవారం అర్ధరాత్రి దాడి జరిగింది. ఈ ఘటనపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల ఇళ్లపై రాత్రి వేళ్లల్లో మద్యం సీసాలు, రాళ్లతో దాడి చేయడం దుర్మార్గమన్నారు. ఈ మేరకు కుప్పం పార్టీ నేతలతో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడి పూర్తి సమాచారం తెలుసుకున్నారు.

చంద్రబాబు నాయుడు
చంద్రబాబు నాయుడు

గంగమ్మ గుడి ఆలయ చైర్మన్‌గా ఉన్నప్పుడు రవి రూ.35 లక్షలు ఫిక్స్‌ డ్ డిపాజిట్ చేశారని చంద్రబాబు పేర్కొన్నారు. ఆ డబ్బు విషయంలో కొద్దిరోజులుగా వైసీపీ నేతలు రవిపై బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. దాడి జరిగిన రెండు గంటల ముందు కూడా రవికి ఫోన్ చేసి బెదిరించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈయనతోపాటు మరో టీడీపీ నేత, గంగమ్మ గుడి మాజీ చైర్మన్ ఆర్ఆర్.రవి ఇంటిపై కూడా వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కుప్పంలో శాంతి భద్రతల సమస్య నెలకొందని, పోలీసులు ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.