అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్‌పై విచారణ రేపటికి వాయిదా

వైఎస్ వివేకా హత్యకేసు దర్యాప్తు అనేక మలుపులు తిరుగుతోంది. సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను తెలంగాణ హైకోర్టు రేపటికి వాయిదా వేసినట్లు సమాచారం. నేడు అవినాశ్ రెడ్డి, వివేకా కుమార్తె సునీత తరఫు న్యాయవాదుల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం… రేపు సీబీఐ వాదనలు విననుంది. అయితే , అవినాశ్ ముందస్తు బెయిల్ పై ఉత్కంఠకు రేపటితో తెరపడే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. నేడు చాలా సేపు హైకోర్టులో వాదోపవాదాలు జరిగాయి. భోజన విరామం తర్వాత తీర్పు వస్తుందని భావించినా, సునీత తరఫు న్యాయవాది వాదనలు వినిపించడంతో… ఈరోజు సీబీఐ వాదనలకు అవకాశం దక్కలేదు. సీబీఐ వాదనలు రేపు వింటామని హైకోర్టు పిలుపునిచ్చింది.

YSR Sister Says 'Avinash Reddy Is Innocent'

వివేకా కుమార్తె సునీత తరఫున వాదించిన న్యాయవాది ఎల్.రవిచందర్… హత్య గురించి జగన్ కు కూడా తెలుసేమో అని సీబీఐ దర్యాప్తు చేస్తోందని అన్నారు. ఆ రోజు ఉదయం 6.30 గంటలకు ముందే తెలుసేమో… జగన్ కు అవినాశ్ రెడ్డే చెప్పారా అనేదానిపై సీబీఐ దర్యాప్తు చేస్తోందని తెలియచేశారు. ఇప్పుడు అవినాశ్ రెడ్డి కూడా హైదరాబాద్ లోనే ఉన్నారు. అవినాశ్ తల్లి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండడంతో ఆయన కూడా ఆసుపత్రిలోనే ఉన్నట్లు సమాచారం.