అయోధ్య కేసు : ఆ ఐదుగురు న్యాయ‌మూర్తులు

-

కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న అయోధ్య భూమి హక్కుల వివాదంపై సుప్రీంకోర్టు శనివారం తుది తీర్పు వెలువరించింది. వివాదాస్పద 2.77 ఎకరాల భూమి హిందువులకే చెందుతుందని చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. ఇక ఈ వివాదానికి ఎట్ట‌కేల‌కు ఫుల్‌స్టాప్ పెట్టేసింది. అదే టైంలో ఇక్క‌డ రామ‌మందిర నిర్మాణం జ‌ర‌గాల‌ని.. అది కూడా కేంద్ర ప్ర‌భుత్వం ఓ ట్ర‌స్ట్ ఏర్పాటు చేసి.. ఆ ట్ర‌స్ట్ ఆధ్వ‌ర్యంలోనే మందిర నిర్మాణం జ‌రిగేలా చూడాల‌ని చెప్ప‌డంతో దీనిపై క్లారిటీ వ‌చ్చేసింది.

అదే టైంలో మసీదు నిర్మాణానికి అయోధ్యలోనే సున్నీ వక్ఫ్‌ బోర్డుకు 5 ఎకరాల స్థలం కేటాయించాలని స్పష్టం చేసింది. భార‌త‌దేశ వ్యాప్తంగా ద‌శాబ్దాలుగా ఎన్నో వివాదాల‌కు కేంద్ర బిందువుగా ఉన్న ఈ కేసును ఓ కొలిక్కి తెచ్చి ఎలాంటి ఇబ్బంది లేకుండా తీర్పు ఇచ్చిన ధ‌ర్మాస‌నంలోని ఆ ఐదుగురు న్యాయ‌మూర్తులు ఎవ‌రు ?  వారి వివ‌రాలు ఏంటో ?  తెలుసుకుందాం.

 

 

1- చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ :
అస్సాంకు చెందిన గొగోయ్ ఈశాన్య రాష్ట్రాల నుంచి సీజేఐగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన తొలి వ్య‌క్తిగా రికార్డుల‌కు ఎక్కారు. గౌహతి హైకోర్టు, పంజాబ్‌ హరియాణా హైకోర్టులో ఆయన సీజేగా పనిచేశారు. 2012లో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఎన్నార్సీ వంటి కేసుల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 17నే ఆయ‌న ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు.

2- జస్టిస్‌ శరద్‌ అర్వింద్‌ బాబ్డే :
గొగోయ్ రిటైర్ అయిన వెంట‌నే బాబ్డే సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు. మ‌హారాష్ట్ర‌లోని నాగ్‌పూర్‌లో ఆయ‌న జ‌న్మించారు. బాబ్డే సీజేఐగా 18 నెలల పాటు కొనసాగనున్నారు. ఆయన 2000లో బాంబే హైకోర్టు అడిషనల్‌ జడ్జిగా పనిచేశారు. 2002లో మధ్యప్రదేశ్‌ సీజేగా నియమితులయ్యారు. 2013లో సుప్రీం న్యాయమూర్తిగా వచ్చారు.

3- జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ :
సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా ఎక్కువ కాలంపాటు పనిచేసిన వైవీ చంద్రచూడ్‌ తనయుడే డీవై చంద్ర‌చూడ్‌. ఆయ‌న 2016లో సుప్రీం న్యాయమూర్తిగా నియమితులయ్యారు. గతంలో బాంబే హైకోర్టు, అలహాబాద్‌ హైకోర్టు సీజేగా పనిచేశారు. వ్యభిచార చట్టం మరియు గోప్యత హక్కు వంటి కీలక కేసులో వాదనలు విన్నారు.

4- జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ :
1970 నుంచి న్యాయవాద వృత్తిలో ఉన్నారు. అప్పటి నుంచే అయోధ్య వివాదంపై పలు దశల్లో పనిచేశారు. అలహాబాద్‌ హైకోర్టులో అడ్వకేట్‌గా పనిచేశారు. అదే కోర్టుకు 2001లో ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. 2014లో కేరళ హైకోర్టులో పనిచేశారు. 2016లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

5- జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ :
1983లో న్యాయ‌వాద వృత్తిలో ప్ర‌వేశించారు. కేరళ హైకోర్టులో 20 ఏళ్ల పాటు సేవలందించారు. 2004లో పూర్తి స్థాయిలో కేరళ హైకోర్టు సీజేగా బాధ్యతలు చేపట్టారు. 2017లో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ట్రిపుల్‌ తలాక్‌ వాదనలు విన్న బెంచ్‌లో సభ్యుడు.

ఏదేమైనా భార‌తదేశ చ‌రిత‌ర‌లోనే అత్యున్నత తీర్పుగా ఎప్ప‌ట‌కి చ‌రిత్ర‌లో నిలిచిపోయిన అయోధ్య కేసులో తీర్పు వెలువ‌రించిన ఐదుగురు స‌భ్యులుగా రికార్డుల్లో నిలిచిపోయిన వీరు అంద‌రూ ఏకాభిప్రాయంతో ఈ కేసులో తీర్పు వెలువ‌రించ‌డంతో దీనిపై రివ్యూ ఫిటిష‌న్ వేసేందుకు కూడా ఛాన్స్ లేదు.

Read more RELATED
Recommended to you

Latest news