ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ దయ్యాలు పాదయాత్ర చేస్తున్నాయి అంటూ చేసిన వ్యాఖ్యలపై టిడిపి పొలిటి బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు తీవ్రంగా ఖండించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి అమర్ హుందాగా మాట్లాడాలని అన్నారు. దయ్యాలు పాదయాత్ర చేస్తున్నాయి అంటారా? రైతుల పక్షాన న్యాయం ఉందని, వారు సుప్రీంకోర్టుకు వెళ్లి అయినా సరే నెగ్గుతారనే విశ్వాసం తనకు ఉందన్నారు. అమరావతి రైతులను దయ్యాలతో పోల్చడం ఏమిటన్నారు.
పులివెందుల పులి గడ్డి తింటుందని ఎద్దేవా చేశారు. మూడు రాజధానిలపై మంత్రి అమర్నాథ్ విసిరిన సవాలుకు అయ్యన్నపాత్రుడు సై అన్నారు. అమరావతి భూములు దోచుకున్నారని తమపై నిందలు వేస్తున్నారని.. మూడు రాజధానులపై రెఫరండంకు సిద్ధమన్నారు. అమరావతి భూములు, విశాఖ భూములపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే తక్షణం అసెంబ్లీని రద్దు చేయాలని.. మూడు రాజధానులపై ఎన్నికలకు వెళ్దాం, నా సవాల్ స్వీకరించాలి అని చాలెంజ్ విసిరారు.