ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ రేపు మంచిర్యాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఇవాళ.. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఅర్ఎస్ పార్టీ నేతలు, పాల్గొన్న ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్, పెద్దపెల్లి పార్లమెంట్ సభ్యులు వెంకటేష్ నేత, ఎమ్మేల్యే దివాకర్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ.. మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజక వర్గంలో రేపు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మినిస్టర్ కేటీఆర్ పర్యటన ఉందని తెలిపారు. మందమర్రి, క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో సుమారు 312,96 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారని ఆయన వెల్లడించారు.
మందమర్రి సమీపంలోని 72 ఎకరాల్లో 500 కోట్ల రూపాయలతో అయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి భూమి పూజ చేస్తారని బాల్క సుమన్ పేర్కొన్నారు. క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో నిర్మాణాలు పూర్తి అయిన 286 డబుల్ బెడ్ రూమ్స్ ను ప్రజలకు పంపిణీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. హైద్రాబాద్ తరహాలో కేసీఆర్ అర్బన్ పార్కుల నిర్మాణానికి భూమి పూజ చేస్తామని బాల్క సుమన్ వెల్లడించారు. 2 కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన సమ్మక్క-సారలమ్మ మహిళ భవన్ ను ప్రారంభిస్తున్నామని, త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాల పంపిణీ, ఇళ్ళ నిర్మాణం కోసం గృహ లక్ష్మి పథకం ద్వారా 3 లక్షల రూపాయలను అందిస్తామని బాల్క సుమన్ తెలిపారు. మందమర్రి పట్టణంలో మినిస్టర్ కేటీఆర్ రోడ్ షోలో పాల్గొంటారు, బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొనాలని పిలుపు ఇచ్చారన్నారు.