కరోనాకు విరుగుడు కనిపెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది సైంటిస్టులు ఇప్పటికే తీవ్రంగా శ్రమిస్తున్నారు. పలు చోట్ల హ్యూమన్ ట్రయల్స్‌ను కూడా ప్రారంభించారు. అయితే ఏ వ్యాధికైనా సరే కొత్తగా వ్యాక్సిన్ రావాలంటే.. అందుకు కనీసం ఎంత లేదన్నా 1 ఏడాది అయినా సమయం పడుతుంది. అయితే ఈ లోపు ప్రత్యామ్నాయ మందులపై సైంటిస్టులు దృష్టి పెట్టారు. అందులో భాగంగానే మలేరియా జ్వరాన్ని తగ్గించేందుకు ఉపయోగించే హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందును, ఎబోలా, సార్స్, స్వైన్ ఫ్లూ, ఎయిడ్స్ తదితర వ్యాధులకు ఇచ్చే మందులను కరోనా చికిత్సకు వాడుతున్నారు. అయితే ఇప్పటి వరకు కేవలం ఇంగ్లిష్ మెడిసినే కానీ.. ఇతర ప్రత్యామ్నాయ వైద్య విధానాలు ఏవీ కరోనాకు ప్రత్యామ్నామ మందులను ప్రతిపాదించలేకపోయాయి. కానీ తాజాగా ఆయుర్వేద వైద్యులు మాత్రం ఫిఫట్రాల్ అనబడే ఓ ఔషధాన్ని కరోనా చికిత్సకు ఉపయోగించవచ్చని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు.
బనారస్ హిందూ యూనివర్సిటీ ప్రొఫెసర్లు.. కరోనా చికిత్సకు ఫిఫట్రాల్ అనబడే ఔషధాన్ని వాడవచ్చని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ ఔషధం శరీరంలో ఉండే బాక్టీరియా, వైరస్‌లను నాశనం చేసి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో జ్వరం, దగ్గు, జలుబు వంటి రోగాలను నయం చేసే మూలికలు ఉన్నాయని.. ఈ ఔషధం తయారీదారు ఏఐఎంఐఎల్ తెలిపింది. అయితే ఫిఫట్రాల్ మందు కరోనాపై పనిచేస్తుందో, లేదో చూడాలని ఆ కంపెనీ తెలియజేసింది.
కాగా ఈ ఔషధాన్ని ఇప్పటికే పలువురు డెంగీ రోగులకు ఇవ్వగా సత్ఫలితాలు వచ్చాయి. అందువల్ల ఈ ఔషధాన్ని కరోనా రోగులకు ఇవ్వాలని బనారస్ హిందూ యూనివర్సిటీ ప్రొఫెసర్లు అంటున్నారు. ఈ ఔషధం కాలేయానికి ఆరోగ్యాన్ని అందించడంతోపాటు శరీరంలో ఉన్న బాక్టీరియా, వైరస్‌లను నాశనం చేస్తుందని వారు చెబుతున్నారు. అయితే ఫిఫట్రాల్ ఔషధాన్ని కేంద్రం కరోనా చికిత్స కోసం క్లినికల్ ట్రయల్స్‌కు పంపిస్తుందా.. లేదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది..!