సాధారణంగా ఏపీలో వారసత్వ రాజకీయాలు ఎక్కువగానే ఉంటాయి. చాలామంది యువనాయకులు తండ్రి వారసత్వంతో తాము కూడా రాజకీయాల్లో సత్తా చాటాలని చూస్తుంటారు. ఇలాగే తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని సత్తా చాటాలని ఓ టీడీపీ యువ నాయకుడు చూస్తున్నారు. అయితే ఈ యువనేతకు ఫ్యామిలీ పరంగా గట్టి సపోర్ట్ ఉంది. అందుకే ఇప్పుడు దూకుడుగా పని చేసుకుంటూ ముందుకెళుతూ, నెక్స్ట్ ఎన్నికలకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఈ విధంగా తండ్రి వారసత్వం తీసుకుని రాజకీయాల్లో దూకుడు కనబరుస్తున్న యువ నాయకుడు ఎవరో కాదు. పెందుర్తి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తనయుడు అప్పలనాయుడు.
ఇక శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, బండారు సత్యనారాయణమూర్తి కుమార్తెని వివాహమాడిన విషయం తెలిసిందే. దీంతో అప్పలనాయుడు, రామ్మోహన్‌కు బామ్మర్ది కూడా అవుతాడు. ఇలా ఫ్యామిలీ సపోర్ట్ గట్టిగా ఉండటంతో అప్పలనాయుడు పెందుర్తి నియోజకవర్గంలో దూకుడుగా ముందుకెళుతున్నారు. తండ్రికి వయసు మీద పడటంతో, ఈయనే ఫీల్డ్‌లో ఉంటూ పార్టీని బలోపేతం చేస్తున్నారు. అలాగే వైసీపీ ప్రభుత్వంపై గట్టిగానే పోరాడుతున్నారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అక్రమాలకు పాల్పడుతున్నారంటూ, పలు ఆరోపణలని చేస్తూ రాజకీయ పరంగా దూకుడు ప్రదర్శిస్తున్నారు.
అలాగే నియోజకవర్గంలో ఉన్న సమస్యలని ఎత్తి చూపుతూ, ప్రజల పక్షాన పోరాడుతున్నారు. ముఖ్యంగా తమ నియోజకవర్గం పెందుర్తిలో వైసీపీ నేతలు భూ అక్రమాలకు పాల్పడుతున్నారనే విషయంపై గట్టిగానే పోరాడుతున్నారు. ఇటు నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తల ఇళ్లపై వైసీపీ వాళ్ళు చేస్తున్న దౌర్జన్యాలకు వ్యతిరేకంగా నిలబడుతున్నారు. ఇలా పెందుర్తిలో తాను ఓ నాయకుడుగా ఎదిగేందుకు అప్పలనాయుడు చూస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకే అప్పలనాయుడు ఇప్పటి నుంచే ఇలా గ్రౌండ్ రెడీ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
అటు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న అన్నపురెడ్డి అదీప్‌రాజ్ సైతం యువకుడే కావడంతో అప్పలనాయుడు ఇప్పటి నుంచే జనాల్లో లేకపోతే ఆయన్ను ఢీకొట్టడం కష్టమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే అప్పలనాయుడు సైతం అదీప్‌రాజ్‌ను కొట్టేందుకు పక్కా ప్లానింగ్‌తోనే ముందుకు వెళుతున్నట్టు కనిపిస్తోంది.