రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీని గెలిపిస్తే మరో మూడేళ్లు సమస్యలు తప్పవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఆయన వికారాబాద్ జిల్లా, తాండూర్, గండిపేట మండలం బండ్లగూడ జాగీర్ నగరపాలక సంస్థ పరిధుల్లో ముఖ్య నాయకులు, నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలను మోసం చేసే పార్టీ కావాలా.. మంచి చేసే పార్టీ కావాల అని ఆలోచించుకోవాలన్నారు. గత ఎన్నికల ముందు నిరుద్యోగ యువతకు రూ. 3 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్న సీఎం కేసీఆర్ ఎందుకు ఇవ్వలేదో చెప్పాలన్నారు. గెలిచే సీటును తన కుమార్తెకు ఇచ్చి, ఓడిపోయే స్థానంలో పీవీ నరసింహారావు కుమార్తెకు కేటాయించారని, టీఆర్‌ఎస్ అభ్యర్థి వాణీదేవికి సొంత వాళ్లే మద్దతు లేదని ఆరోపించారు.
నాడు మౌనం ఎందుకు ..?
పీవీ కుటుంబం గౌరవం ఉంటే నాడు పీవీ ఘాట్‌ను కూల్చివేస్తామని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అంటే ఎందుకు మౌనంగా ఉన్నారో తెలుపాలన్నారు. దుబ్బాకలో బీజేపీ గెలవడంతో 50 శాతం పన్నులు తగ్గాయన్నారు. లాలూ ప్రసాద్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తు పెట్టుకోవాలని బీజేపీ అధికారంలోకి వస్తే ఫాంహాస్ నుంచి జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. రాష్ట్రంలోని ఒక్కో నిరుద్యోగికి రూ. 78 వేల బాకీ పడ్డారని వచ్చే బడ్జెట్‌లో వారి కోసం నిధులు కేటాయించి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ హామీలు తప్ప చేసిందేమీ లేదని, కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించడమే పనిగా పెట్టుకున్నారని బండి సంజయ్ ఆరోపించారు.