పదో తరగతి క్వశ్చన్ పేపర్ లీక్ వ్యవహారంలో అరెస్టయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ జైలు నుంచి విడుదలయ్యారు. భారీ బందోబస్తు నడుమ కారాగారం నుంచి విడుదలై బండి సంజయ్.. బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వంపై, రాష్ట్ర పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు.
ఎంపీ పట్ల పోలీసుల ప్రవర్తన దారుణంగా ఉందని బండి సంజయ్ మండిపడ్డారు. పోస్టులు, పైసల కోసమే పోలీసులు పనిచేస్తున్నారని ఆరోపించారు. కొందరు పోలీసు అధికారుల తీరుపై కిందిస్థాయి పోలీసులు బాధపడుతున్నారని చెప్పారు. వరంగల్ సీపీకి.. పేపర్ లీక్‌కు.. మాల్ ప్రాక్టీస్‌కు మధ్య ఉన్న తేడా తెలియదని దుయ్యబట్టారు. 20 మార్కులకు పాసయ్యే హిందీ పేపర్‌ను ఎవరైనా లీక్ చేస్తారా అని ప్రశ్నించారు. 30 లక్షల మంది యువత భవిష్యత్తును నాశనం చేస్తే ప్రశ్నించకూడదా? అని నిలదీశారు.
‘టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రాల లీకేజ్ కేసులో సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. ముఖ్యమంత్రి కుమారుడిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి. పరీక్షలు రాసే అభ్యర్థులకు రూ.లక్ష సాయం చేయాలి. పదోతరగతి పత్రాల లీక్ ఘటనను కూడా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపే దమ్ముందా..? త్వరలో వరంగల్‌లో నిరుద్యోగ యువతతో భారీ ర్యాలీ నిర్వహిస్తాం.’ – బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు