ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ పై బీజేపీ విమర్శల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా బండి సంజయ్ బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటును తీవ్రంగా ఖండిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి జెండా, అజెండా ఏం లేదని విమర్శించారు. టీఆర్‌ఎస్ ప్రారంభించినప్పుడు ఆ పార్టీలో ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఎంత మంది మిగిలారని ప్రశ్నించారు.
సీఎం కేసీఆర్ ఏ ఉద్దేశంతో జాతీయ పార్టీ పెడుతున్నారో ప్రజలకు చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. జాతీయ పార్టీ ఏర్పాటుకు సొంత పార్టీ నాయకుల అభిప్రాయాలు కూడా తీసుకోలేదని ఆరోపించారు. బీజేపీకి వ్యతిరేకంగా మాత్రమే జాతీయ పార్టీ పెట్టే కుట్ర చేస్తున్నారన్నారు.
మరోవైపు సీఎం కేసీఆర్ సొంత విమానం కొనుగోలు చేయడంపై బండి ఫైర్ అయ్యారు. కేవలం కేఏ పాల్, కేసీఆర్ లకు మాత్రమే సొంత విమానాలు కొన్నారని.. భవిష్యత్ లో బీఆర్ఎస్ ప్రజాశాంతి పార్టీతో పొత్తు పెట్టుకుంటుందేమోనని అన్నారు. మునుగోడు ఉపఎన్నిక నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే జాతీయ పార్టీ ప్రకటన చేశారని బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తే ప్రజల తీర్పునకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ అని పేరు మార్చుకున్నారని మండిపడ్డారు.