భారత రాజ్యాంగాన్ని మార్చాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఇవాళ (గురువారం, ఫిబ్రవరి 3) ‘మౌన దీక్ష’కు సిద్ధమయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఢిల్లీలో ఉన్న బండి సంజయ్ కుమార్ రాష్ట్రానికి పార్టీ ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాబూరావు, పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శి కామర్సు బాలసుబ్రమణ్యం, కేంద్ర జలవనరుల శాఖ సలహాదారు వెదిరె శ్రీరాంసహా పలువురు పార్టీ నేతలతో కలిసి ‘మౌన దీక్ష’ చేయనున్నారు.
ఉదయం 11 నుండి రాజ్ ఘాట్ వద్ద ఎంపీలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలని నిర్ణయించారు. రాజ్యాంగాన్ని మార్చాలంటూ అంబేద్కర్ ను అవమానించిన కేసీఆర్ ను రాజ్యాంగ ద్రోహిగా దేశ ప్రజల ద్రుష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు ఈ విషయంలో బహిరంగ క్షమాపణ చెప్పే వరకు ఈ అంశాన్ని వదిలిపెట్టకూడదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ భావిస్తున్నారు.