కేసీఆర్ గజగజ వణికుతున్నాడు.. అందుకే ఢిల్లీకి వెళ్లాడు : బండి సంజయ్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఊపర్ షేర్వానీ…అందర్ పరేషానీ అన్నట్లు…. పాదయాత్ర చూసి… కేసీఆర్ గజగజ వణికిపోతున్నాడని.. అందుకే ఢిల్లీకి పోయి కూర్చున్నాడని ఎద్దేవా చేశారు. ఢిల్లీపోయి పార్టీ ఆఫీస్ కు శంకస్థాపన చేస్తే…అందరూ జెండా పండుగ చేస్కోవాలట….ఎవరైనా అట్ల చేసుకుంటరా? అని ప్రశ్నించారు.

Bandi Sanjay Kumar | బండి సంజ‌య్
Bandi Sanjay Kumar | బండి సంజ‌య్

మోదీని కలిసేందుకు కేసీఆర్ శతవిధాలా ప్రయత్నిస్తున్నాడని…. టీఆర్ఎస్-బీజేపీ ఒక్కటేననే తప్పుడు సంకేతాలను పంపాలని కుట్ర చేస్తుండని ఫైర్ అయ్యారు. బీజేపీ టీఆర్ఎస్ తో దోస్తీ ఉండదన్నారు. ఎప్పుడైనా టీఆర్ఎస్ తో కలిసి బీజేపీ పోటీ చేసిందా? టీఆర్ఎస్ తో కాంగ్రెస్, టీడీపీ, ఎంఐఎం, కమ్యూనిస్టులు పార్టీలు కలిసి పోటీ చేసినయ్ తప్ప ఏనాడూ బీజేపీ టీఆర్ఎస్ తో కలిసి పోటీ చేయలేదని గుర్తు చేశారు. మోదీని కలిసి బయటకు రావడమే తరువాయి….మోదీ ‘ శభాష్ కేసీఆర్.’ అని కితాబిచ్చినట్లుగా మనసు విప్పి మాట్లాడినట్లుగా మీడియాకు లీకులిస్తూ అబద్దపు వార్తలు రాయించి ప్రజలను తప్పుడు సంకేతాలు పంపే దుర్మార్గుడు కేసీఆర్ అని నిప్పులు చెరిగారు. కోతల రాయుడు మాటలు నమ్మి మీడియా మోసపోవద్దని కోరుతున్నానని… మోదీ ప్రజాస్వామ్యవాది.. ఏ సీఎం వెళ్లినా కలిసి సమస్యలు వింటాడన్నారు.