సింగరేణి పై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి రాసిన లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ విడదల చేశారు. సింగరేణి ప్రైవేటీకరణ అసాధ్యమని.. ఇదంతా టీఆర్ఎస్ దుష్ప్రచారమే అని ఫైర్ అయ్యారు. కార్మికులారా… టీఆర్ఎస్ మాటలు నమ్మవద్దని కోరారు. రాష్ట్రం ఆమోదం లేకుండా ప్రైవేటీకరణ మాటే ఉత్పన్నం కాదని.. ముఖ్యమంత్రి కేసీఆర్ పూటకో అబద్దం… రోజుకో మాట మాట్లాడుతూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని నిప్పులు చెరిగారు.
తన జిత్తుల మారి ఎత్తులతో రైతులను, విద్యార్థులను, కార్మికులను మోసం చేస్తున్నారని.. ధాన్యం సేకరణ విషయంలో రైతులను నట్టేట ముంచిన కేసీఆర్ తాను చేసిన తప్పిదాలను కేంద్రంపై మోపి బీజేపీ బదనాం చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలో కొంగు బంగారం…. నల్లబంగారానికి నెలవైన సింగరేణి సంస్థను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరిస్తోందంటూ విష ప్రచారానికి తెరదీస్తూ సింగరేణి కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారని నిప్పులు చెరిగారు. సింగరేణి ఎన్నికలు వస్తుండటంతో కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు ఆడే అబద్దాలకు అంతూపొంతు లేకుండా పోయిందని. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు…అన్నట్లుగా సిగ్గులేకుండా పచ్చి అబద్దాలు వల్లిస్తున్నారని నిప్పులు చెరిగారు.