గణేశ్ నవరాత్రులనగానే ఖైరతాబాద్ గణపయ్య, ఆ తర్వాత బాలాపూర్ లడ్డూ విశేషంగా గుర్తొస్తాయి. ఇక బాలాపూర్ లడ్డూ వేలంపాట కోసం భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఏటికేడు బాలాపూర్ లడ్డూ తన రికార్డును తానే బ్రేక్ చేస్తూ వస్తోంది. కానీ ఈ ఏడాది బాలాపూర్ లడ్డూ రికార్డును బ్రేక్ చేస్తూ అల్వాల్ లో రూ.46 లక్షలకు వేలంపాట పాడగా.. ఈ రికార్డును కూడా బ్రేక్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది బండ్లగూడ లడ్డూ వేలంపాట.
రాజేంద్రనగర్ బండ్లగూడ పరిధిలోని రిచ్మండ్ విల్లా కాలనీలో లడ్డూ ధర రాష్ట్రంలోనే కొత్త రికార్డు క్రియేట్ చేసింది. వేలంలో ఎవరూ ఊహించని రీతిలో లడ్డూ ధర రూ.60.80లక్షలు పలికింది. డాక్టర్ సాజీ డీసౌజా బృందం ఇంత భారీ మొత్తం వెచ్చించి లడ్డూను సొంతం చేసుకున్నారు.
గణనాథుని లడ్డూను దక్కించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని సాజీ డీసౌజా తెలిపారు. కులం, మతం కన్నా మానవత్వమే ముఖ్యమని అన్నారు. లడ్డూ వేలం పాటలో వచ్చిన డబ్బులను.. ఆర్వీ దియా ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేద ప్రజల సంక్షేమం కోసం ఉపయోగిస్తామని చెప్పారు.