బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర నాలుగో విడత ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఈ యాత్ర పది రోజుల పాటు సాగనుంది. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మల్కాజిగిరి, మేడ్చల్, ఉప్పల్, ఎల్బీ నగర్‌తో పాటు.. ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో బండి సంజయ్ పాదయాత్ర కొనసాగనుంది.
ఈ యాత్రలో మొత్తం 115.3 కిలోమీటర్ల మేర బండి సంజయ్ నడవనున్నారు. దారి పొడవునా ప్రజా సమస్యలు తెలుసుకోనున్నారు. ఇప్పటి వరకు మూడు విడతల్లో 11 వందల 28 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. మొత్తం 18 జిల్లాలు, 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర పూర్తి చేశారు. ఇప్పుడు చేపట్టే యాత్రతో కలిపి.. 8 పార్లమెంట్ నియోజకవర్గాలతో 48 అసెంబ్లీ సెగ్మెంట్లలో పూర్తి అవుతుంది.
పాదయాత్రలో భాగంగా ప్రతి రోజు సగటున బండి సంజయ్ 11 కిలోమీటర్ల మేర యాత్రను సాగించనున్నారు. గతంలో రోజుకు సుమారుగా 15 కిలోమీటర్లకు పైగా నడిచారు. ఇప్పుడు గ్రేటర్ పరిధిలో బండి ఈ యాత్ర చేపడుతున్నారు. మహా నగరంలో సమస్యలు అధికంగా ఉండటంతో అన్ని వర్గాల ప్రజలను కలిసి.. వారి సమస్యలను తెలుసుకోవాలనే ఉద్దేశంతో బండి సంజయ్ రోజుకు 10 నుంచి 11 కిలోమీటర్లకే కుదించుకున్నారు.