ఐపీఎల్‌లో బెంగ‌ళూరు బోణీ.. హైదరాబాద్‌పై గెలుపు..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 13వ ఎడిష‌న్‌లో భాగంగా దుబాయ్ ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ స్టేడియంలో జ‌రిగిన మ్యాచ్‌లో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుపై రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు 10 ప‌రు‌గుల తేడాతో విజ‌యం సాధించింది. బెంగ‌ళూరు విసిరిన 164 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో హైద‌రాబాద్ జ‌ట్టు ఆరంభంలో మెరుగ్గా ఆడినా.. మిడిలార్డ‌ర్ వైఫ‌ల్యం చెందడంతో మ్యాచ్‌లో ఓడిపోయింది. దీంతో ఐపీఎల్‌లో త‌న తొలి మ్యాచ్‌లో బెంగ‌ళూరు బోణీ కొట్టింది.

bangalore won by 10 runs against hyderabad in ipl 3rd match

మ్యాచ్‌లో ముందుగా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా.. రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు బ్యాటింగ్ చేప‌ట్టింది. ఈ క్ర‌మంలో ఆ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 163 ప‌రుగులు చేసింది. బెంగ‌ళూరు బ్యాట్స్‌మెన్ల‌లో దేవ్‌ద‌త్ ప‌డిక్క‌ల్ (42 బంతుల్లో 56 ప‌రుగులు, 8 ఫోర్లు), ఏబీ డివిలియ‌ర్స్ (30 బంతుల్లో 51 ప‌రుగులు, 4 ఫోర్లు, 2 సిక్స‌ర్లు)లు రాణించారు. హైద‌రాబాద్ బౌల‌ర్ల‌లో న‌ట‌రాజ‌న్‌, విజ‌య్ శంక‌ర్‌, అభిషేక్ శ‌ర్మ‌ల‌కు త‌లా 1 వికెట్ ద‌క్కింది.

అనంత‌రం బ్యాటింగ్ చేప‌ట్టిన హైద‌రాబాద్ జ‌ట్టు 19.4 ఓవ‌ర్ల‌లో 153 ప‌రుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ జ‌ట్టు బ్యాట్స్‌మెన్లలో జానీ బెయిర్ స్టో (43 బంతుల్లో 61 ప‌రుగులు, 6 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), మ‌నీష్ పాండే (33 బంతుల్లో 34 ప‌రుగులు, 3 ఫోర్లు, 1 సిక్స‌ర్‌)లు రాణించారు. బెంగ‌ళూరు బౌల‌ర్ల‌లో చాహ‌ల్ 3 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా, న‌వ‌దీప్ సైనీ, శివం దూబెలు చెరో 2 వికెట్లు తీశారు. డేల్ స్టెయిన్‌కు 1 వికెట్ ద‌క్కింది.