ఏపీ లో ఎంట్రీకి బండి సంజయ్ రెఢీ ? శాంపిల్ చూపించారుగా

-

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఏపీ వైపు వేగంగా దూసుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. దానికి సంబంధించిన సంకేతాలను ఆయన ఇచ్చేసారు. తెలంగాణలో మాదిరిగా ఏపీలోనూ బిజెపి ఇక పరుగులు పెట్టబోతోందని, రాబోయే రోజుల్లో అధికారం దక్కించుకుంటుంది అని, తెలంగాణతో పోలిస్తే బీజేపీ కార్యకర్తలు మరింత బలవంతులని చెబుతూనే, ఏపీ రాజకీయాల్లో తమ సత్తా చాటేందుకు అన్ని ఏర్పాట్లు  చేసుకుంటున్నారు.

ఇప్పటికే కేంద్ర బీజేపీ పెద్దలు సంజయ్ ను ఏపీ రాజకీయాలపై దృష్టి పెట్టాలని ఆదేశించడం, దీనికి సంబంధించి ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఢిల్లీకి పిలిపించి మరి అన్ని విషయాలపై సమగ్రంగా చర్చించడం వంటివి జరిగాయి. ముఖ్యంగా తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలలో బీజేపీ సత్తా చాటాలని, ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి లో బీజేపీ పాగా వేస్తే అది శుభ సూచకం గా ఉంటుందని అందుకే ఈ ఎన్నికలలో బీజేపీ జెండా ఎగురవేసే బాధ్యతలను సైతం సంజయ్ కు బీజేపీ అధిష్టానం అప్పగించినట్లు గా కనిపిస్తోంది.

హిందుత్వానికి కి బ్రాండ్ అంబాసిడర్ అన్నట్టుగా ఉన్న బిజెపి కి ఏపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు సైతం బాగా కలిసి వస్తున్నాయి. కొద్ది రోజులుగా ఏపీలో దేవాలయాలపై దాడులు జరుగుతుండడం కూడా సంచలనంగా మారింది. వాటిని ఆధారంగా చేసుకుని ఇప్పుడు ఏపీలో రాజకీయ బలం పెంచుకునేందుకు బిజెపి ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయంలో ఏపీ బీజేపీ నేతలు కాస్త మొహమాట పడుతున్నట్లుగా వ్యవహరిస్తుండడంతో, నేరుగా బండి సంజయ్ రంగంలోకి దిగిపోయారు.

తెలంగాణ బిజెపి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మరీ ఏపీ ప్రభుత్వం పై విమర్శలు చేశారు. ఏపీలో ఒక మతం రాజ్యమేలుతోందని, మీకు బైబిల్ పార్టీ కావాలో.. భగవద్గీత పార్టీ కావాలో మీరే తేల్చుకోవాలి అంటూ తిరుపతి ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా తిరుపతి పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసిపి రెండు కళ్ల సిద్ధాంతం అంటోందని, ఏడుకొండల వాడ గోవిందా గోవిందా అనేది బిజెపి సిద్ధాంతం అని వ్యాఖ్యానించారు.

తిరుపతి ఉప ఎన్నికల కోసం దేశమంతా ఎదురు చూస్తోందని, వైసీపీ ప్రభుత్వం వెంటనే మూటా ముల్లే సర్దుకుని వెళ్ళేలా తరిమికొడతాం అంటూ సంజయ్ విమర్శలు చేశారు. పూర్తిగా ఏపీలో దేవాదాయ శాఖను ప్రక్షాళన చేయాలని, హిందూ భక్తులు సమర్పించే కానుకలను దారి మళ్లిస్తున్నారు అని ఆరోపించారు. బీజేపీ కార్యకర్తల సహనాన్ని చేతగానితనంగా తీసుకోవద్దు అంటూ హెచ్చరించారు. ఏపీ లో సోము వీర్రాజు నాయకత్వంలో ఇక మరింత యాక్టివ్ గా ప్రభుత్వంపై పోరాడేందుకు బిజెపి సిద్ధమవుతోందని సంజయ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సంజయ్ మాట్లాడిన విధానం చూస్తుంటే, ఇక పూర్తిగా తెలంగాణ, ఏపీ బిజెపి నాయకులు వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నట్లుగా కనిపిస్తున్నారు.

అలాగే త్వరలోనే తిరుపతి ఉప ఎన్నికల లో బిజెపి పట్టు సాధించేందుకు అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు బండి సంజయ్ తిరుపతి లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని నియోజకవర్గాల్లో పర్యటించేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఏ విధంగా అయితే మత రాజకీయ లపై ఫోకస్ పెట్టి సక్సెస్ అయ్యారో ఇప్పుడు ఏపీలోనూ అదే ఫార్ములాను ఉపయోగించి సక్సెస్ అవ్వాలనే దిశగా బిజెపి అడుగులు వేస్తున్నట్లు గా కనిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news