ప్రసాద్‌గౌడ్‌ వచ్చింది ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని చంపేందుకే! : బంజారాహిల్స్ పోలీసులు

-

ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డిని చంపేందుకే నిందితుడు ప్రసాద్‌గౌడ్‌ ఇక్కడికి వచ్చాడని బంజారాహిల్స్‌ పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్‌ మండలం కల్లెడ గ్రామ మాజీ సర్పంచి లావణ్యగౌడ్‌ను అవమానించారని భావించి జీవన్‌రెడ్డిని హత్య చేయాలని సోమవారం రాత్రి ప్రసాద్‌ గౌడ్‌ బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే ఇంటికి వచ్చాడని తెలుసుకున్నారు.

ఇందుకోసం రెండు నెలల నుంచి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడని గుర్తించారు. అతడికి ఆయుధాలు సమకూర్చిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసులో ఏ-2 లావణ్యగౌడ్‌కు శనివారం తాఖీదులిస్తామని పశ్చిమ మండల పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

పథకంలో భాగంగా ప్రసాద్‌గౌడ్‌ ఉత్తర్‌ప్రదేశ్‌కు వెళ్లి పిస్టల్‌ కొన్నాడు. తొలుత నేపాల్‌, తర్వాత నాందేడ్‌ అంటూ చెప్పిన ప్రసాద్‌.. తర్వాత నిజం చెప్పాడు. ఇందుకోసం రూ.32 వేలు మధ్యవర్తి ద్వారా చెల్లించాడు. సంతు అలియాస్‌ సంతోష్‌ ద్వారా దేశీ పిస్టల్‌ కొనుగోలు చేసినట్లు విచారణలో ప్రసాద్‌గౌడ్‌ పోలీసులకు చెప్పాడు. తర్వాత కొద్దిరోజులకు తూటాల కోసం బిహార్‌కు వెళ్లగా అక్కడ లభించకపోవడంతో అక్కడి నుంచి దిల్లీకి వెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలింది. అనంతరం తూటాల కోసం నాందేడ్‌కు వెళ్లినా ఫలితం లేకపోవడంతో రూ.1800కు బటన్‌ చాకు కొన్నాడు. హైదరాబాద్‌లో బేగంబజార్‌ ప్రాంతంలో చిన్న ఇనుపగుళ్లు పట్టే బొమ్మ తుపాకీ కొనుగోలు చేశాడు. ప్రసాద్‌గౌడ్‌కు ఆయుధాలను సమకూర్చిన మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

ఈ నెల 2వ తేదీ రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ప్రసాద్‌గౌడ్‌ దేశీ పిస్టల్‌, తన రెండు చరవాణులను కారులో పెట్టాడు. బొమ్మ తుపాకీని నడుం వెనుక, కత్తిని జేబులో పెట్టుకొని నేరుగా ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి నివాసంలోకి వెళ్లాడు. అక్కడున్న సిబ్బంది కళ్లుగప్పి మూడో అంతస్తులోకి చేరుకున్నాడు. పైకి ఎలా, ఎందుకొచ్చావని, కిందకు వెళ్లాలని జీవన్‌రెడ్డి చెప్పడంతో కిందకు వెళ్లాడు. అనంతరం కిందకు వెళ్లిన జీవన్‌రెడ్డితో ప్రసాద్‌గౌడ్‌ గొడవకు దిగాడు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేపై దాడి చేశాడు. సిబ్బంది అతన్ని పట్టుకొనే ప్రయత్నం చేయగా నడుము భాగంలో తుపాకీ కనిపించడంతో అదుపులోకి తీసుకొన్నారు.

తనిఖీ చేయగా జేబులో కత్తి దొరికింది. ప్రసాద్‌గౌడ్‌ కారులో పోలీసులకు పిస్టల్‌, రెండు చరవాణులు లభించాయి. బొమ్మ తుపాకీతో కాల్చినా అందులోని ఇనుపగుళ్లు తగిలితే తీవ్ర గాయాలయ్యేవని పోలీసులు చెబుతున్నారు. ఘర్షణలో జీవన్‌రెడ్డికి స్వల్ప గాయాలవ్వడంతో ఆయన మీడియా ముందుకు రావడం లేదని తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news