’30 డేస్ రూల్’ .. ఖర్చులు తగ్గించుకునేందుకు సూపర్ మంత్ర

-

సంపాదించడం కంటే డబ్బు కూడబెట్టడం చాలా కష్టమైన పని. ఎంత సంపాదిస్తున్నామనే దానికన్నా ఎలా ఖర్చు పెడుతున్నామన్నది ముఖ్యం. ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే పాటించాల్సిన ఏకైక మంత్ర మన ఖర్చులపై మనకో క్లారిటీ ఉండటం. పక్కా ప్రణాళికతో ఖర్చు పెడితేనే ఆర్థిక స్వావలంబన సాధించగలుగుతాం. ఒకటో తారీఖున వచ్చిన నెల జీతం ఐదో తారీఖు వరకల్లా మాయమైపోతోందంటే.. మీకు ఆర్థిక ప్రణాళిక లేనట్లే. మీ నెల జీతం మీరు ఎలా ఖర్చు పెడుతున్నారో తెలుసుకునేలా.. మీకంటూ ఓ ఫినాన్షియల్ ప్లాన్ ఉండాలి. అనవసరపు ఖర్చులు తగ్గించుకోవాలి. అందుకోసం ఈ 30 డేస్ రూల్ ట్రై చేయండి.

ప్ర‌తి నెల ఇంటి అవ‌స‌రాలు, పిల్ల‌ల ట్యూష‌న్ ఫీజులు, ఇత‌ర ఖ‌ర్చుల‌ను అంచ‌నావేసి బ‌డ్జెట్ రూపొందించి ఖ‌ర్చు చేస్తుంటారు. కానీ నెల చివ‌రకు అనుకున్నంత మొత్తం ఆదా చేయ‌డంలో విఫ‌ల‌మ‌వుతారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం. హా.. ఒక వెయ్యి రూపాయలేగా అనవసరంగా ఖర్చు చేసింది అనుకున్నట్టే పొరపాటే చిన్న పాటి ఖ‌ర్చుల‌ను లెక్క‌లోకి తీసుకోక‌పోవ‌డం వల్ల మీ పొదుపును తగ్గిపోతుంది.

మీరు త‌రుచుగా ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేవారా? షాపింగ్ వెబ్‌సైట్లు, త‌ర‌చుగా అందుబాటులో ఉన్న ఆఫ‌ర్ల గురించి క‌స్ట‌మ‌ర్ల మొబైల్‌కి మేసేజ్‌ల‌ను పంపుతుంటాయి. ఇలాంటి మేసేజ్‌ల‌ను చూసిన‌ప్పుడు ఆఫ‌ర్లు బాగున్నాయ‌నే ఉద్దేశంతో అవ‌స‌రం లేక‌పోయినా వ‌స్తువుల‌ను కొనుగోలు చేసేస్తుంటాం. ఇప్ప‌టికే రెండు జ‌త‌ల బూట్లు ఉన్న‌ా ఆఫ‌ర్‌లో త‌క్కువ‌కు వ‌స్తున్నాయ‌ని మ‌రొక జ‌త కొనుగోలు చేయ‌డం వంటివి చేస్తుంటాం. నెల‌కు రూ.50 వేల నుంచి రూ.70 వేలు సంపాదించే వారికి రూ. 1000 – రూ.1500 ఖ‌ర్చు చేయ‌డం పెద్ద‌గా అనిపించ‌దు. కానీ, ఇలాంటి చిన్న చిన్న కొనుగోళ్లు మీకు తెలియ‌కుండానే ఖర్చుల‌ను పెంచేస్తాయి.

అటువంటి కొనుగోళ్లను నివారించేందుకు ఒక చ‌క్క‌టి పరిష్కారం 30-రోజుల నియమం. ఇది ఆలోచించకుండా ఖర్చు చేసే అలవాటును అధిగమించడంలో మీకు సహాయపడటమే కాకుండా, మీ ఆర్థిక విషయాలకు సంబంధించి బడ్జెట్, క్రమశిక్షణ, మెరుగైన నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని పెంపొందించడంలో కూడా సహాయపడుతుంది.30 రోజుల నియ‌మం ఎలా ప‌నిచేస్తుంది?

మీరు ఏదైనా వ‌స్తువును కొనుగోలు చేయాల‌నుకున్న‌ప్పుడు అది మీకు అవ‌స‌ర‌మా లేదా తెలుసుకునేందుకు.. కొనుగోళ్ల‌ను క‌నీసం 30 రోజులు వాయిదా వేయండి. 30 రోజుల త‌ర్వాత కూడా మీకు ఆ వ‌స్తువు అవస‌రం ఉండి.. కొనుగోలు చేయాల‌నుకుంటే చేయొచ్చు. ఒక‌వేళ 30 రోజుల త‌ర్వాత ఆ వ‌స్తువు కొనుగోలు గురించి మీరు మ‌ర్చిపోయినా లేదా ఆ వ‌స్తువు అవ‌స‌రం లేదు అనిపించినా కొనుగోలును వాయిదా వేయ‌డం వ‌ల్ల ఆ డ‌బ్బును ఆదా చేస్తారు. ఇలా చేయ‌డం వ‌ల్ల ఆ వస్తువును అన‌వ‌స‌రంగా కొనుగోలు చేశామ‌ని త‌ర్వాత చింతించ‌కుండా ఉంటారు. అంతేకాకుండా కొనుగోళ్ల విష‌యంలో అవ‌గాహ‌న‌తో కూడిన నిర్ణ‌యం తీసుకోగులుగుతారు.

వ‌స్తువును కొనుగోలు చేయ‌డం ఇప్పుడు వాయిదా వ‌స్తే.. ఈ మొత్తాన్ని వేరే ఖ‌ర్చుల‌కు మ‌ళ్లిస్తార‌నే ఉద్దేశంతోనో, ఆఫర్లు మ‌ళ్లీ రావ‌నే ఆలోచ‌న‌తోనో కొనుగోళ్ల‌ను వాయిదా వేసేందుకు చాలామంది ఇష్ట‌ప‌డ‌రు. అలాంటప్పుడు మీరు కొందామనుకున్న వస్తువుకు ఖర్చయ్యే మొత్తాన్ని పక్కన పెట్టండి. 30 రోజుల తర్వాత కూడా మీ నిర్ణయం ఆ వస్తువు కొనడమే అయితే ఆ డబ్బు వాడండి లేదంటే ఇతర పెట్టుబడుల్లో ఈ డబ్బుని వినియోగించండి. ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల అన‌వ‌స‌ర ఖ‌ర్చుల‌ను నియంత్రించ‌డం మాత్ర‌మే కాకుండా పెట్టుబ‌డుల‌ను పెంచి లక్ష్యాన్ని త్వ‌ర‌గా చేరుకోవ‌చ్చు. ప్రారంభంలో ఈ విధానం క‌ష్టంగా అనిపించినా.. పోనుపోనూ మంచి ఫ‌లితాల‌ను అందిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news