నోట్ల రద్దు దయతో డిజిటల్ చెల్లింపుల జోరు ఒక్కసారిగా పెరిగిపోయింది. కరోనా, లాక్డౌన్ వల్ల ఇంకా జోరందుకుంది. కానీ డిజిటల్ ఆర్థిక లావాదేవీలపై కొందరికి మాత్రం ఇంకా నమ్మకం కుదరడం లేదు. దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రధాని నరేంద్ర మోదీ బ్యాంక్ అధికారులకు సూచించారు.
డిజిటల్ ఆర్థిక లావాదేవీలపై ప్రజల్లో మరింత విశ్వాసం పెంచేలా కృషి చేయాలని మోదీ చెప్పారు. వినూత్న ఆవిష్కరణలకు ప్రభుత్వ ప్రోత్సాహం తోడైతే అద్భుతాలకు ఉదాహరణగా ఆర్థిక సాంకేతిక(ఫిన్‌టెక్) రంగం నిలుస్తుందని గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ (జీఎఫ్‌ఎఫ్) సందర్భంగా మోదీ పేర్కొన్నారు.
‘జన్ ధన్- ఆధార్- మొబైల్ (జేఏఎం), యూపీఐ విజయవంతం ద్వారా మన జీవితంలో డిజిటల్ చెల్లింపులు భాగమయ్యాయి. ఫిన్‌టెక్, అంకురాల విభాగంలో ఆవిష్కరణలకు, పెట్టుబడులకు అంతర్జాతీయ ప్రధాన కేంద్రంగా భారత్ అవతరించేందుకు ఇది దోహదం చేస్తుంద’ని మోదీ తెలిపారు. నాణ్యమైన ఆర్థిక సేవల ద్వారా నిరుపేదలను కూడా ఆర్థిక సాధికారత దిశగా నడిపించేందుకు కృషి చేయాలని సూచించారు.