క్యాన్సర్‌తో పోరాడుతున్న రోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రారంభ దశలోనే క్యాన్సర్‌ను గుర్తించి, రోగుల జీవిత కాలాన్ని పెంచే క్రమంలో తెలంగాణ సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు సత్ఫలితాలనిస్తున్నాయి. నగరంలోని ఎంఎన్‌జే క్యాన్సర్ దవాఖాన ఆధ్వర్యంలో మొబైల్ బస్సు ద్వారా రోగుల గుమ్మం వద్దకే వెళ్లి వారికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు జరుపుతున్న విషయం తెలిసిందే. గ్రేటర్‌లోనే కాకుండా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలపై ఎక్కువగా దృష్టి పెట్టారు. వారంలో రెండు నుంచి మూడు చొప్పున ప్రత్యేక క్యాంప్‌ల ద్వారా ఈ స్క్రీనింగ్ పరీక్షలు జరుపుతున్నారు.
సాధారణంగా నమోదవుతున్న క్యాన్సర్ రోగుల్లో 40శాతానికి పైగా రోగులు తమకు వ్యాధి ఉన్నట్లు తెలియకుండానే జీవిస్తున్నారని, దీంతో వ్యాధి ముదిరిన తరువాత తీవ్ర లక్షణాలతో దవాఖానకు వస్తున్నట్లు వైద్యనిపుణులు చెబుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ సర్కార్ ప్రారంభ దశలోనే క్యాన్సర్ వ్యాధులను గుర్తించి రోగుల ప్రాణాలు కాపాడే క్రమంలో ఎంఎన్‌జే దవాఖాన ద్వారా పెద్ద ఎత్తున స్క్రీనింగ్ టెస్టులకు శ్రీకారం చుట్టింది.