పర్సనల్‌ లోన్‌ ఇవ్వాలంటే బ్యాంకులు ఏం చూస్తాయి.. మీరు ఏం చేయాలి..?

-

ఒక కంపెనీ జాబ్‌ ఇచ్చే ముందు ఉద్యోగిలో చాలా విషయాలను బేరీజు వేసుకుంటుంది. జాబ్‌ చేసే సామర్థ్యం ఉందా, జీతం ఎంత వరకూ ఇవ్వొచ్చు, ప్రీవియస్‌ చేసిన కంపెనీలో ఎంత జీతం తీసుకున్నాడు, ఎలా పనిచేసేవాడు, అతని ప్రవర్తన ఎలా ఉంటుంది. ఇలా చాలా విషయాలను చూసుకుని జాబ్‌ ఇస్తారు. అలాగే మనం లోన్‌ కోసం అప్లై చేసుకున్నప్పుడు బ్యాంకులు చాలా విషయాలను పరిగణలోకి తీసుకుంటారు. ఈ మధ్య కాలంలో పర్సనల్‌ లోన్‌ తీసుకునే వారి సంఖ్య బాగా పెరిగింది. బ్యాంకులు ఈ రుణాలు ఇచ్చేటప్పుడు కొన్ని నియమ నిబంధనలను కలిగి ఉంటాయి. అందుకే కొందరికి ఈ రుణాలు తక్కువ వడ్డీ రేటుతో తేలికగానే లభిస్తాయి. ఇంతకీ రుణం ఇచ్చే ముందు బ్యాంకులు ఏమేం చూస్తాయో ఇప్పుడు చూద్దాం..

వడ్డీ రేట్లు నిర్ణయించే ముందు

వ్యక్తిగత రుణాలకు వడ్డీ రేటు అందరికీ ఒకేలా ఉండదు. అది మీరు చేసే ఉద్యోగం, ఆ కంపెనీకి ఉన్న గుడ్‌విల్‌, మార్కెట్‌లో ఆ కంపెనీకి ఉన్న షేర్ వాల్యూ, మీరు ఎన్ని ఏళ్లుగా అందులో చేస్తున్నారు, మీ సిబిల్‌ స్కోర్‌, శాలరీ ఇవన్నీ ఆధారంగా వడ్డీ రేటు నిర్ణయిస్తారు. ఏ రుణానికైనా దరఖాస్తుదారులు ముందు చూసేది వడ్డీ రేటే. వ్యక్తిగత రుణాల వడ్డీ రేట్లు ఇంటి, వాహన రుణాలపై వర్తించే వాటి కంటే ఎక్కువుగా ఉంటాయి. అందువల్ల ఈ రుణానికి దరఖాస్తు చేసేటప్పుడు, సాధ్యమయ్యే అతి తక్కువ వడ్డీ రేటుకు ప్రయత్నించాలి. కొన్ని ప్రముఖ బ్యాంకులు 11-14% వరకు వడ్డీ రేట్లను వసూలు చేస్తున్నాయి. రుణ యాప్‌లయితే 28-30% కూడా వడ్డీని వసూలు చేస్తాయి. వీలైనంత తక్కువ వడ్డీ రేట్లతో వ్యక్తిగత రుణాన్ని పొందడం చాలా ముఖ్యం.

క్రెడిట్‌ స్కోరు

వ్యక్తిగత రుణానికి దరఖాస్తు చేయడానికి ముందు నుంచే క్రెడిట్‌ స్కోరును పెంచుకోవాలి. మెరుగైన క్రెడిట్‌ స్కోరు కలిగినవారు.. వ్యక్తిగత రుణాన్ని వేగంగా పొందడమే కాకుండా, తక్కువ వడ్డీ రేటు కూడా పొందుతారు. ఈ రుణానికి ఎటువంటి పూచీకత్తు లేనందున..750, ఇంతకంటే ఎక్కువ క్రెడిట్‌ స్కోరు ఉన్నవారిని తక్కువ రిస్క్‌ ఉన్న దరఖాస్తుదారునిగా బ్యాంకులు పరిగణిస్తాయి. ఈ క్రెడిట్‌ స్కోరును మెరుగ్గా నిర్వహించడానికి మీ క్రెడిట్‌ కార్డు బిల్లును సకాలంలో తీర్చాలి. అంతేకాకుండా ఇతర రుణాలకు సంబంధించిన ఈఎంఐలను గడువులోగా చెల్లించేయాలి. మీరు ఏ రుణానికైనా సహ దరఖాస్తుదారుగా (కో అప్లికెంట్) ఉన్నా, ఏ ఇతర రుణ దరఖాస్తుదారునికి గ్యారంటర్‌గా ఉన్నా, ఆ రుణ ఖాతా ఈఎంఐలను సకాలంలో చెల్లించేలా చూసుకోవాలి. మీరు క్లీన్‌ పేమెంట్‌ హిస్టరీ కలిగి ఉంటే బ్యాంకులు విధించే వడ్డీ రేట్లపై డిస్కౌంట్‌ కూడా అడగొచ్చు.

మల్టిపుల్‌ అప్లికేషన్స్‌

ఒకే సమయంలో అనేక క్రెడిట్‌ కార్డులకు లేదా వ్యక్తిగత రుణాల కోసం దరఖాస్తు చేయకూడదు. దీని వల్ల మీరు క్రెడిట్‌పై చాలా ఆత్రంగా ఉన్నారని బ్యూరోలు పరిగణిస్తాయి. ఇది క్రెడిట్‌ స్కోరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. రుణం, క్రెడిట్‌ కార్డు పొందే విషయంలో ఒకసారి ఫెయిలయితే, కొంత సమయం తీసుకుని మెరుగైన క్రెడిట్‌ స్కోరుని సాధించాక మళ్లీ ప్రయత్నించడం మంచిది. లేదంటే మీ క్రెడిట్‌ స్కోర్‌ ఘోరంగా దెబ్బతింటుంది.

శాలరీ అకౌంట్‌ ఉన్న బ్యాంకులో రుణం..

వ్యక్తిగత రుణాన్ని వేగంగా పొందడానికి ఇప్పటికే శాలరీ అకౌంట్‌/ డిపాజిట్లు / క్రెడిట్‌ కార్డు కలిగి ఉన్న బ్యాంకును సంప్రదించడం ఉత్తమం. బ్యాంకుకు మీ నెలవారీ ఆదాయం, ఉపసంహరణ వివరాలు క్షుణంగా తెలుస్తాయి. కాబట్టి, జీతం ఖాతా ఉన్నవారికి సరసమైన వడ్డీ రేట్లతో పాటు తక్కువ ప్రాసెసింగ్‌ ఫీజులతో బ్యాంకు త్వరగా రుణాన్ని మంజూరు చేస్తుంది. దరఖాస్తుదారుని క్రెడిట్‌ స్కోరు, లోన్‌ మొత్తం, లోన్‌-టు-వాల్యూ రేషియో, నెలవారీ ఆదాయం, జాబ్‌ ప్రొఫైల్‌, ఇతర ప్రమాణాల ఆధారంగా బ్యాంకులు రుణ మంజూరును, వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయి.

పే స్లిప్స్‌

రుణ మంజూరుకు ఉద్యోగ చరిత్రను సూచించే పే-స్లిప్‌లను బ్యాంకులు చూస్తాయి. రెండు సంవత్సరాల ఉపాధి చరిత్రను కలిగి ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసేవారికి, పబ్లిక్‌ సెక్టార్‌ యూనిట్ల (PSU)లో ఉద్యోగం చేస్తున్న వ్యక్తులకు వ్యక్తిగత రుణాలను మంజూరు చేయడానికి బ్యాంకులు ఇష్టపడతాయి. MNC లేదా ప్రముఖ పేరున్న కంపెనీలలో పని చేసేవారికి కూడా బ్యాంకులు ప్రాధాన్యం ఇస్తాయి. అంటే మీరు లోన్‌ తీసుకోవాలంటే.. మీతో పాటు మీరు పని చేసే కంపెనీ కూడా చాలా ముఖ్యం.

Read more RELATED
Recommended to you

Latest news