నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన నాలుగో రోజు కొనసాగుతోంది. తమ డిమాండ్లు పరిష్కరించేంత వరకు ఆందోళన కొనసాగుతూనే ఉంటుందని విద్యార్థులు ప్రకటించారు. సమస్యల పరిష్కారం కోసం బాసర ట్రిపుల్ ఐటి వద్ద విద్యార్థులు చేస్తున్న ఆందోళనలకు ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. కాసేపట్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బాసరకు బయలుదేరనున్నారు. త్రిపుల్ ఐటీ విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. త్రిపుల్ ఐటీ బాసర క్యాంపస్ లో దయనీయమైన పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. అహంకారంతో సీఎం కేసీఆర్ విద్యార్థుల శక్తిని తక్కువగా అంచనా వేస్తున్నారన్నారు. విద్యార్థులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. మరోవైపు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా బాసరకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.రేవంత్, బండి సంజయ్ రానుండడంతో బాసరలో టెన్షన్ వాతావరణం నెలకొంది.