రాష్ట్రంలోని బీసీ మనసుల్లో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సుస్థిర స్థానం సంపాదించుకున్నారు అంటూ సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అన్నారు. కుల గణన ప్రక్రియ నవంబరు 15 నుంచి చేపడుతున్నట్టు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వెల్లడించారు. కులాల గణాంకాలు నిర్ధారించేందుకు సంక్షేమ శాఖల ఉన్నతాధికారులతో కమిటీ వేసినట్టు తెలిపారు. ఏ విధంగా కులగణన జరిపించాలన్నది ఈ కమిటీ అధ్యయనం చేస్తుందని, న్యాయపరమైన చిక్కులు రాకుండా, సమగ్ర రీతిలో కుల గణన చేపట్టేందుకు సీఎం జగన్ చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు.
ఈ కుల గణన కార్యక్రమంలో వార్డు/గ్రామ సచివాలయ ఉద్యోగులతో పాటు వాలంటీర్ల సేవలు కూడా వినియోగించుకోనున్నట్టు వివరించారు. 139 వర్గాలుగా ఉన్న బీసీ కులాలకు ఉపయుక్తంగా ఉండేలా ఈ గణన కార్యక్రమం ఉంటుందని మంత్రి తెలిపారు. జనగణన జరిగే క్రమంలో కులగణన కూడా జరిపించేలా కేంద్ర ప్రభుత్వానికి అసెంబ్లీ నుంచి తీర్మానం పంపించామని వెల్లడించారు. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, కర్నూలు వంటి ప్రధాన పట్టణాల్లో బీసీ సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి వారి సలహాలు, సూచనలు తీసుకుంటామని మంత్రి చెల్లుబోయిన చెప్పారు.