కరోనా కారణంగా నిరవధికంగా వాయిదా పడ్డ ఐపీఎల్ 13వ ఎడిషన్ షెడ్యూల్ ఖరారు అయిందా..? అంటే అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ టోర్నీని నిర్వహించాలనే బీసీసీఐ పట్టుదలగా ఉంది. ఈ క్రమంలోనే టోర్నీ షెడ్యూల్‌ను దాదాపుగా ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాదిలోనే సెప్టెంబర్ 26 నుంచి నవంబర్ 8వ తేదీ వరకు ఐపీఎల్ 2020 టోర్నీని నిర్వహించనున్నారని తెలిసింది. ఈ మేరకు బీసీసీఐ ఓ షెడ్యూల్‌ను దాదాపుగా ఫైనల్ చేసినట్లు తెలిసింది.
అయితే సెప్టెంబర్ వరకు దేశంలో కరోనా తగ్గే సూచనలు కనిపించకపోవడంతో ప్రేక్షకులు లేకుండానే స్టేడియాల్లో మ్యాచులను నిర్వహిస్తారని తెలుస్తోంది. ఇక ఆయా నగరాల్లో హోటల్స్‌కు బాగా దగ్గరగా ఉండే స్టేడియాలైతే ఇంకా అనుకూలంగా ఉంటుందని బీసీసీఐ భావిస్తోందట. దీంతో ప్రయాణ దూరం తగ్గుతుంది. అలాగే అలాంటి రెండు, మూడు వేదికలైతే టోర్నీ మొత్తం సింపుల్‌గా ముగిసిపోతుంది. దీంతో చాలా వరకు ఖర్చులు తగ్గుతాయి. ఈ క్రమంలో తమకు కలిగే నష్టాన్ని బీసీసీఐ, ఫ్రాంచైజీలు కొంత వరకు పూడ్చుకునేందుకు అవకాశం ఉంటుంది.
అయితే సెప్టెంబర్ సమయంలో ఉత్తర భారతదేశంలో వర్షాలు ఎక్కువగా పడతాయి.. అందుకని టోర్నీని దక్షిణాది రాష్ట్రాల్లో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోందట. ఇక బెంగళూరు, చెన్నై, ముంబై నగరాల్లో టోర్నీ మొత్తం ముగిసే అవకాశం ఉందని సమాచారం. కానీ బెంగళూరు వరకు ఓకే.. మిగిలిన రెండు నగరాల్లో ప్రస్తుతం కోవిడ్ 19 విలయ తాండవం చేస్తుంది. మరి అప్పటి వరకు ఆ రెండు నగరాల్లో ఆ వైరస్ తగ్గుతుందా, లేదా అన్నది చూడాలి. అలాగే మరోవైపు అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకు టీ20 వరల్డ్ కప్ జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఆ టోర్నీపై ఐసీసీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఐపీఎల్ జరుగుతుందా, లేదా అన్నది ఇప్పటికైతే ప్రశ్నార్థకంగానే మారింది. అయినప్పటికీ ముందుగా ఓ షెడ్యూల్‌ను సిద్ధం చేసి ఉంచితే మంచిదేగా.. అన్న ధోరణిలో ప్రస్తుతం బీసీసీఐ ఐపీఎల్ షెడ్యూల్‌ను రూపొందిస్తున్నట్లు తెలిసింది. ఇక దీనిపై జూలై నెలలోనే ఐసీసీ నిర్ణయం తరువాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.