కరోనా మహమ్మారి వల్ల ఈ ఏడాది ఐపీఎల్ నిరవధికంగా వాయిదా పడింది. ఈ క్రమంలో బీసీసీఐ సెప్టెంబర్ – నవంబర్ నెలల మధ్య ఐపీఎల్ టోర్నీని నిర్వహించేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. మరోవైపు అదే సమయంలో ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్‌పై ఐసీసీ ఇంకా ఎటూ తేల్చలేదు. అయినప్పటికీ వరల్డ్ కప్ కచ్చితంగా క్యాన్సిల్ అయ్యే సూచనలే కనిపిస్తుండడంతో బీసీసీఐ ఐపీఎల్ నిర్వహణకు గ్రౌండ్ వర్క్ సిద్ధం చేస్తోంది.
సాధారణంగా ఐపీఎల్ టోర్నీకి 3 వారాల ముందే ప్లేయర్లు టీంలతో వచ్చి చేరుతారు. ఆ 3 వారాల పాటు శిక్షణ శిబిరంలో ప్లేయర్ల ఫిట్‌నెస్, ఇతర అంశాలను పరీక్షించి టోర్నీలో బరిలోకి దిగే అత్యుత్తమ జట్టు ఏదో ఎంపిక చేసుకుంటారు. అయితే బీసీసీఐ మాత్రం ఈ సారి ఐపీఎల్‌ను దుబాయ్‌లోనే నిర్వహించేందుకు మొగ్గు చూపుతుండడంతో అక్కడ భారత ఐపీఎల్ ప్లేయర్లకు శిబిరం నిర్వహించాలని చూస్తోంది. 6 వారాల పాటు శిబిరం నిర్వహిస్తామని ఇండియన్ టీం మేనేజ్‌మెంట్ ఇప్పటికే బీసీసీఐకి తెలిపింది.
దుబాయ్‌లో శిబిరం నిర్వహించడం ద్వారా ప్లేయర్ల ఫిట్‌నెస్, ఇతర అంశాలను ఫ్రాంచైజీలు తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. మరోవైపు టీ20 వరల్డ్ కప్ రద్దు అయి ఐపీఎల్ నిర్వహణకు మార్గం సుగమమం అయితే వెంటనే ఐపీఎల్ షెడ్యూల్‌ను ప్రకటిస్తారు కనుక.. ఎలాగూ శిబిరంలో భారత ప్లేయర్లు అందుబాటులో ఉంటే.. ఫ్రాంచైజీలకు మరింత ఉపయోగం ఉంటుంది. కనుకనే బీసీసీఐ కూడా భారత ఐపీఎల్ ప్లేయర్లకు దుబాయ్‌లో ప్రత్యేక క్యాంప్‌ను నిర్వహించాలని ఆలోచిస్తోంది. అయితే దీనిపై బీసీసీఐ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.