బీసీల ప్రశ్న… మాకూ మనోభావాలుంటాయి!

-

టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆయన అరెస్ట్ పై ఇప్పుడు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు టీడీపీ నేతలు. వీరిలో చంద్రబాబు నాయుడు సహా టీడీపీ నేతలు అంతా దీన్ని బీసీలపై దాడిగా అభివర్ణించే ప్రయత్నం చేశారు! అచ్చెన్నాయుడి కిడ్నాప్‌ బహీనవర్గాలపై దాడి.. రాష్ట్రవ్యాప్తంగా బడుగు బహీనవర్గాలు, మేధావులు, ప్రజలు నిరసన తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి! అని చంద్రబాబు స్పందిస్తే… బీసీనేతలకిచ్చే గౌరవం ఇదేనా? అని రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు! ఏసీబీ అరెస్టు చేసింది బీసీ నాయకుడు అని కాదు… అవినీతి చేసిన మాజీ మంత్రి అని.. అని వైకాపా నాయకులు ఎంత చెబుతున్న.. బాబు రాజకీయం మారడం లేదు!

అచ్చెన్నాయుడిని అరెస్టు చేసింది… బీసీ మంత్రి అని కాదు… కార్మికుల క‌ష్టార్జితంతో న‌డిచే ఈఎస్ఐలో చోటు చేసుకున్న భారీ అవినీతి కేసులో ఆరోపణలు రావడం, ఏసీబీ దగ్గర ఆధారాలు ఉండటం వల్ల! ఇక దీన్ని బీసీలపై దాడిగా అభివర్ణించడంలో అర్ధం లేదు. చంద్రన్న కానుక – ఏపీ ఫైబర్ గిర్డ్ లలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ సీబీఐ ఎంక్వైరీ కోరింది.. కమ్మలపై దాడిగా కాదు.. ప్రజాధనం కొందరు నాయకుల చేతుల్లోకి పోయిందని! పైగా అసెంబ్లీలో అచ్చెన్నాయుడు బలమైన బీసీ నేతగా… జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నందుకు కాదు… గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన నేత అవినీతికి పాల్పడినట్లుగా ఆధారాలు ఉన్నందుకు. ఇక్కడ అన్ని విషయాల్లోనూ మంత్రి – అవినీతి అన్న టాపిక్ లే ఉన్నాయి తప్ప… బీసీ అనే ఆలోచన ఎక్కడుంది?

ఇక బీసీలపై చంద్రబాబుకు కొత్తగా ప్రేమ పుట్టుకురావడంపై కూడా విమర్శలు వెళ్లివెత్తుతున్నాయి. ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఇచ్చిన హామీ మేర‌కు.. ఆల‌యాల్లో ప‌నిచేస్తున్న త‌మ‌కు క‌మీష‌న్‌ను పెంచాల‌ని స‌చివాల‌యం ద‌గ్గ‌ర నాటి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును నాయీ బ్రాహ్మ‌ణులు కోరారు. అప్పుడు బాబు ఎలా ప్రవర్తించారో అందరికీ గుర్తుండే ఉంటుంది. దీంతో ఒక్క‌సారిగా కోపోద్రిక్తుడైన చంద్ర‌బాబు… త‌న‌తో పెట్టుకుంటే తోక‌లు క‌త్తెరిస్తానంటూ నాయీ బ్రాహ్మ‌ణులు మ‌నోభావాల‌నే దెబ్బ‌తీసేలా వ్య‌వ‌హ‌రించారు.

ఇప్పుడు బీసీలు, వారి గౌరవాల గురించి మాట్లాడుతున్న రామ్మోహన్ నాయుడికి, ఇతర టీడీపీ నేతలకు నాడు బీసీలు గుర్తు రాలేదా.. బీసిలకు ఇవ్వాల్సిన గౌరవం అప్పుడు కనిపించలేదా? అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేస్తే.. అది కూడా అవినీతి కేసులో అరెస్టు చేస్తే.. బీసీలు గుర్తుకు వస్తారా? ఇంకా బీసీల మనోభావాలతో ఆడుకునే ప్రయత్నాలు మానరా? అచ్చెన్నాయుడికే కాదు.. బీసీ సామాజిక వర్గంలో పుట్టిన సామాన్యులకు మనసులు ఉంటాయి.. వాటికీ భావాలు ఉంటాయి? అని బీసీ సామాజిక వర్గానికి చెందిన సామాన్యులు ప్రశ్నిస్తున్నారు! టీడీపీ నేతల దగ్గర సమాధానాలు ఉన్నాయా?

Read more RELATED
Recommended to you

Latest news