జేసీ తండ్రీకొడుకుల అరెస్టుపై నారా తండ్రీకొడులు ఏమన్నారంటే..?

-

ఈ రోజు ఉదయం తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డిలను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ అరెస్టును టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేస్తున్నారని, నిన్న అచ్చెన్నాయుడు, నేడు జేసీ ప్రభాకర్‌రెడ్డి అరెస్టులు జగన్ కక్ష సాధింపు చర్యలేనని చంద్రబాబు అన్నారు. తాను జైలుకు వెళ్లానన్న అక్కసుతో జగన్ కక్ష పెంచుకుని ఇతరులను జైలుకు పంపుతున్నారని వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలను శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులు  పెడుతున్నారన్నారు. ప్రతీకారేచ్ఛతో రాష్ట్రాన్ని జగన్ పతనం చేస్తున్నారని, కక్ష సాధింపు చర్యలతో తెలుగుదేశం పార్టీని ప్రజల నుంచి దూరం చేయలేరని, రెట్టించిన బలంతో ప్రజా సమస్యలపై పోరాడతామని చంద్రబాబు స్పష్టం చేశారు.

అలాగే ఈ విషయంపై లోకేష్ స్పందిస్తూ.. 16 నెలల జైలు పక్షి, లక్ష కోట్ల దోపిడీదారు, 11 కేసుల్లో ఏ1 నిందితుడు జగన్‌రెడ్డి.. టీడీపీ నాయకుల్ని జైల్లో పెట్టి రాక్షస ఆనందం పొందాలనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది పాలనలో జగన్ ఒక చేతగాని ముఖ్యమంత్రి అనే విషయం ప్రజలకు అర్థమైందని వ్యాఖ్యానించారు. జగన్‌ ను అభద్రతా భావం వెంటాడుతోందని తెలిపారు. అందుకే రాజారెడ్డి రాజ్యాంగంలో వేధింపుల పర్వానికి తెరలేపారని ధ్వజమెత్తారు. ప్రలోభాలకు లొంగితే వైసీపీ కండువా, లొంగకపోతే జైలుకు పంపిస్తున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండే జేసీ కుటుంబంపై కక్ష సాధింపు మొదలు పెట్టారని గుర్తుచేశారు. ప్రతిపక్ష నేతలపై వేధింపులు, కక్ష తీర్చుకోవడానికే జగన్ ముఖ్యమంత్రి అయినట్టు ఉందని వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news