కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు మనమంతా సిద్ధంగా ఉండాలని, వైరస్ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రధాని మోదీ అన్నారు. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంపై ఆదివారం సాయంత్రం నిర్వహించిన సార్క్ దేశాల వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. సార్క్ దేశాల్లో 150 కన్నా తక్కువగానే కరోనా కేసులు నమోదయ్యాయని, అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాల్సిందేని అన్నారు.
సార్క్ దేశాల్లో ప్రజల ఆరోగ్యం, సదుపాయాల కల్పనలో అనేక సవాళ్లు ఉన్నాయని, వాటిని మనం అధిగమించాలని మోదీ అన్నారు. సార్క్ దేశాలన్నీ కలసికట్టుగా పనిచేసి కరోనా వైరస్‌ను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు కావల్సిన అన్ని రకాల వైద్య సదుపాయాలను భారత్‌లో ఏర్పాటు చేశామని తెలిపారు. కనుక ప్రజలు భయాందోళనలకు గురి కావల్సిన పనిలేదన్నారు.
కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని మోదీ సూచించారు. కరోనాను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన అన్ని చర్యలను ఇప్పటికే చేపట్టామని తెలిపారు. జనవరి మధ్యలో భారత్‌లో కరోనా పరీక్షలు మొదలు పెట్టామని, కరోనాను ఎదుర్కొనేందుకు ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళ్తున్నామన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు, బాధితులకు కావల్సిన చికిత్సను అందించేందుకు ఇప్పటికే వైద్య సిబ్బందికి శిక్షణ ఇచ్చామని తెలిపారు. కాగా సార్క్‌లో భారత్‌తోపాటు ఆఫ్గనిస్థాన్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవ్స్, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంకలు సభ్య దేశాలుగా ఉన్నాయి.