ప్రధాని పర్యటన.. బేగంపేట టు పరేడ్ గ్రౌండ్స్ రూట్ మూసివేత

-

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ హైదరాబాద్ నగరంలో పర్యటించనున్నారు. ఈ నేథ్యంలో ప్రధాని రాకకు పరేడ్‌ మైదానం సిద్ధమైంది. ప్రధాన వేదికతో పాటు దానికి ఎదురుగా మూడు భారీ జర్మన్‌ షెడ్లు, సాంస్కృతిక కార్యక్రమాలకు మరో షెడ్డును సిద్ధం చేశారు. ప్రధాన వేదికపై జరిగే కార్యక్రమాన్ని ప్రజలు స్పష్టంగా తిలకించేందుకు ఎల్‌ఈడీ తెరలు పెట్టారు.

సుమారు రెండు వేల మంది పోలీసులు సికింద్రాబాద్‌ పరిసరాల్లోని పలు మార్గాల్లో పహారాలో నిమగ్నమయ్యారు. బేగంపేట విమానాశ్రయం నుంచి పరేడ్‌ మైదానం మీదుగా సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ వరకు ఉన్న మార్గాన్ని ఇవాళ ఉదయం నుంచి మధ్యాహ్నం ప్రధాని పర్యటన ముగిసేవరకు మూసేయనున్నారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లోని 8, 9, 10 ప్లాట్‌ఫారాలపై ఇవాళ మధ్యాహ్నం వరకు రాకపోకలను నిలిపివేశారు.

స్టేషన్‌కు ఇరువైపులా రాకపోకలు సాగించడానికి వీల్లేకుండా కేవలం ఒకటో నంబరు ప్లాట్‌ఫాం వైపే ప్రయాణికులను అనుమతించనున్నారు. పాదచారుల వంతెనలపై 7వ నంబరు ప్లాట్‌ఫాం వరకే అనుమతిస్తారు. ప్రధాని భద్రతను పర్యవేక్షించే స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ (ఎస్పీజీ) స్థానిక పోలీసులతో కలిసి అడ్వాన్స్‌డ్‌ సెక్యూరిటీ లైజనింగ్‌ (ఏఎస్‌ఎల్‌) నిర్వహించింది. ప్రధాని ప్రయాణించే మార్గాల్లో కాన్వాయ్‌తో రిహార్సల్స్‌ నిర్వహించారు.

Read more RELATED
Recommended to you

Latest news