కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే దేశంలోని పలు ప్రముఖ ఆలయాలను కొద్ది రోజుల పాటు మూసివేసిన సంగతి తెలిసిందే. ఇక కరోనా ఎఫెక్ట్ భద్రాచలం శ్రీసీతారాముల కల్యాణంపై కూడా పడింది. ప్రతి ఏటా భద్రాచలంలో సీతారాముల కల్యాణం ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి మాత్రం భక్తులు లేకుండానే బోసిగా కల్యాణం నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ సారి భద్రాచలంలో సీతారాముల కల్యాణాన్ని ఆలయ ప్రాంగణంలోనే నిర్వహిస్తామని మంత్రి పువ్వాడ తెలిపారు. ఈ క్రమంలో కల్యాణం భక్తులు లేకుండానే జరుగుతుందని ఆయన తెలిపారు. అలాగే శ్రీరామనవమి వేడుకలను ఆలయంలోనే నిర్వహిస్తామని తెలిపారు. ఏప్రిల్ 2న జరిగే సీతారాముల కల్యాణం భక్తులు లేకుండానే జరుగుతుందని అన్నారు.
ఇక కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఖమ్మంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి పువ్వాడ తెలిపారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలు చెందవద్దని, అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకుంటే కరోనాను నివారించవచ్చని తెలిపారు.