గత రెండు నెలలుగా మావోయిస్టులు సరిహద్దు రాష్ట్రమైన చత్తీస్గఢ్ రాష్ట్రంలో 25 మంది అమాయక ఆదివాసి ప్రజలను పోలీస్ ఇన్ఫార్మర్ల నెపంతో పొట్టన పెట్టుకున్నారని కాస్త జాగ్రత్తగా ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్ పి సునీల్ దత్ హెచ్చరించారు. తెలంగాణ సరిహద్దు కలిగి ఉన్న జిల్లాలలో కూడా మావోయిస్టులు గత పదిహేను రోజులలో ఇద్దరు అమాయక ప్రజలను చంపివేశారని ఆయన అన్నారు. ప్రజలతో వారి అవసరాలు తీరిన తర్వాత వారినే పోలీసు ఇన్ఫార్మర్ల నెపంతో చిత్రహింసలకు గురి చేసి చంపుతున్నారని ఆయన అన్నారు.
అందుకే ప్రజలు ఎవరూ కూడా మావోయిస్టులకు సహకరించడానికి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనికి వెళ్ళరాదు. ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలలో పోలీసులు గస్తీ దళాలతో అటవీ ప్రాంతమంతా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఎవరైనా కనబడితే కాల్చి వేసే అవకాశం ఉందని అన్నారు. ఒక వేళ అలా కనిపిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని అన్నారు. చర్ల, దుమ్ము గూడెం మరియు భద్రాచలం ప్రాంతాలలో కూడా పోలీసు నిఘాను పెంచారు కాబట్టి ప్రజలు ఎవరూ మావోయిస్టులకు సహకరించడానికి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి వెళ్ళ రాదని ఆయన అన్నారు. ఆర్ఎంపీ డాక్టర్లు గానీ మరియు వ్యాపారులు గానీ మావోయిస్టు పార్టీకి సహకరించి మీ ప్రాణాల మీదకు తెచ్చుకోకూడదని విజ్ఞప్తి చేస్తున్నానని ఆయన అన్నారు.