వ్యాక్సిన్ తయారీ, ఉత్పత్తిలో భారత్ బయోటెక్ సంస్థ దూసుకెళ్తోంది. ఇప్పటికే కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు కొవాగ్జిన్‌ను కనిపెట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొవాగ్జిన్ నాజిల్ వ్యాక్సిన్‌ను కూడా రూపొందించింది. ఈ టీకాలు భారత్‌తో పాటు ప్రపంచ దేశాల్లో వినియోగానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది.
తాజాగా భారత్ బయోటెక్ గ్రూపు సంస్థ జంతు టీకాలు, మందుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బయోవెట్.. రేబిస్ వ్యాధి వ్యాప్తిని నిరోధించేందుకు కుక్కలకు ఇచ్చే టీకాను అభివృద్ధి చేయడంపై పరిశోధనలు చేపట్టింది. ఈ విషయాన్ని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (బీబీఐఎల్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి.సాయిప్రసాద్ తెలిపారు. ‘బయో ఆసియా 2023’ చర్చాగోష్ఠిలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
కుక్కకాటుతో రేబిస్ సోకి మన దేశంలో ఏటా 25,000 మందికి పైగా చనిపోతున్నందున, సాధ్యమైనంత త్వరగా ఈ టీకాను ఆవిష్కరిస్తామని సాయిప్రసాద్ తెలిపారు. బెంగళూరు కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్న బయోవెట్ ఇప్పటికే ఈ ప్రాజెక్టును చేపట్టిందని చెప్పారు. వచ్చే రెండేళ్లలో ఈ టీకాను ఆవిష్కరించాలనేది తమ ఆలోచనని ఆయన వెల్లడించారు.