సీనియర్లకే సాధ్యం కాలేదు..ఈ మంత్రిగారికి అంత సీన్ ఉందా…!

-

తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అనూహ్యంగా కేబినెట్‌లో చోటు సంపాదించారు. అంతా బావుంది అనుకున్న టైంలో మంత్రి గారికి అదిరిపోయే టాస్క్ ఇచ్చింది ప్రభుత్వం. శ్రీకాకుళం జిల్లాలోని వలసలను తగ్గించాలనే ఉద్దేశంతో గడిచిన ఐదేళ్లుగా ఊగిసలాడుతున్న భావనపాడు పోర్టుపై కదలిక తెచ్చింది వైసీపీ సర్కార్‌. జిల్లాలో వైసీపీకి అనేక మంది సీనియర్ నాయకులు ఉన్నా.. నిర్వాసితులను ఒప్పించలేకపోతున్నారు. ఇప్పుడీ సమస్యను కొలిక్కి తెచ్చే బాధ్యతలను మంత్రి సీదిరి అప్పలరాజుకు అప్పగించిందట ప్రభుత్వం.

ఈ గ్రీన్‌ ఫీల్డ్‌ పోర్టు కోసం 2వేల 486 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. తొలిదశ నిర్మాణానికి 3 వేల 619 కోట్ల ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. 2020-21 నాటికి మొదటి దశ పూర్తి చేసి 8.7 మిలియన్‌ టన్నుల దిగుమతులు, ఎగుమతల లక్ష్యంగా పెట్టుకున్నారు పాలకులు. మంత్రి అప్పలరాజు స్థానికుడు.. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడంతో ఆయనైతే నిర్వాసితులను చిటికెలో ఒప్పిస్తారని అంతా అనుకున్నారు. కానీ అలా అనుకున్న వారి అంచనాలన్నీ తలకిందులయ్యాయట. DPRకు సర్కార్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చి 2 నెలలవుతున్నా నిర్వాసితులను ఒప్పించలేకపోతున్నారట. గ్రామస్తులు తమ డిమాండ్ల నుంచి వెనక్కి తగ్గకపోవడంతో.. ఏం చెప్పాలో నాయకులకు పాలుపోవడం లేదట.

వైసీపీ వర్గాల్లోనూ ఈ పరిణామాలు చర్చకు దారితీస్తున్నాయి. భావనపాడు పోర్టు నిర్వాసితుల సమస్య మంత్రికి విషమపరీక్షగా మారిందనే వారు కూడా ఉన్నారు. ఇంకా భూ సమీకరణలో అడుగు ముందుకు పడకపోవడం…నిర్వాసితులను పట్టు వీడకపోవడం మంత్రి అప్పలరాజుకు విషమపరీక్షగా మారిందట . మొత్తానికీ అటు నిర్వాసితులు పట్టు విడవక …. ఇటు తన టాస్క్ ను వదులుకోలేక ఈ డాక్టర్ మంత్రి సతమతమైపోతున్నారట .
నేనూ ఇక్కడి వాడినే మన బతుకులు బాగుంటాయ్ ఒప్పుకోండి సామీ అని లోకల్ ఫీలింగ్ ను తెరపైకి తెచ్చినా… ఎవరూ తలొగ్గడం లేదట . అత్తెసరు ప్యాకేజీలతో ఉన్న ప్రాంతాన్ని అక్కడి వారు వదులకునేలా లేకపోవడంతో… తనకు అప్పగించిన బాధ్యతను వదిలిపెట్టలేక ఆ మంత్రిగారికి తల బొప్పి కడుతోందట.

Read more RELATED
Recommended to you

Latest news